థియేటర్ల బంద్ కారణంగా నెల రోజుల నుంచీ సరైన సినిమాలు లేవు. చిన్నా చితకా చిత్రాలొచ్చినా థియేటర్ల దగ్గర సందడి లేకుండా పోయింది. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ఒక్క పోస్టరు కూడా కనిపించలేదు. అయితే ఈవారం మళ్లీ బాక్సాఫీసుకు కొత్త కళ రాబోతోంది. అగ్ర హీరోల చిత్రాలేం లేకపోయినప్పటికీ – వసూళ్ల జోష్ కనిపించే అవకాశం ఉంది. ఈ వారం కిరాక్ పార్టీ, ఐతే 2.0, కర్తవ్యం, దండుపాళ్యం 3.. బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి.
నాలుగు సినిమాలున్నా… కళ్లన్నీ కిరాక్ పార్టీవైపే ఉండడం సహజం. నిఖిల్ మంచి పామ్‌లో ఉన్నాడు. ట్రైలర్లు, పాటలూ ఆకట్టుకుంటున్నాయి. పైగా కుర్రాళ్ల సినిమా. యువతరానికి కావల్సిన అంశాలన్నీ ఈ కథలో కనిపిస్తున్నాయి. అందుకే… కిరాక్ పార్టీకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. డబ్బింగ్ బొమ్మ కర్తవ్యం కూడా జనాల్ని థియేటర్లకు రప్పించే అవకాశం ఉంది. నయనతార కథానాయిక కావడం, ప్రీమియర్ షో..కి మంచి స్పందన రావడం కర్తవ్యంకి కలిసొచ్చే అంశాలు. దండు పాళ్యం సిరీస్‌కి మంచి స్సందన వచ్చింది. బీసీ సెంటర్లలో ఈ సిరీస్‌కి ఆదరణ ఉంది. దండు పాళ్యం 3 కూడా మాస్‌ని మెప్పించే అవకాశం ఉంది. ఐతేతో చిన్న సినిమాల్లో ఓ కదలిక వచ్చింది. ఇప్పుడు ఐతే 2 కూడా అలాంటి అద్భుతాలేం సృష్టిస్తుందన్న నమ్మకాలేం లేకపోయినా.. టైటిల్ ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. చిత్రబృందం కూడా పబ్లిసిటీ వినూత్నంగా చేస్తోంది. మొత్తానికి గత కొన్ని వారాలుగా కళ తప్పిన బాక్సాఫీసుకు.. ఈ వారం నుంచి కొత్త జోష్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.