కాలేజీ జీవితం, అక్కడ చేసే అల్లరి, ర్యాంగుల గోల, లెక్చలర్స్పై జోకులు, బంకు కొట్టి సినిమాకి వెళ్లడం… అబ్బో.. ఇవన్నీ అద్భుతమైన, అందమైన జ్ఞాపకాలు. వీటిని సరిగా హ్యాండిల్ చేస్తూ సినిమా తీస్తే ఎంత బాగుంటుందో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాలో చూపించేశాడు. ఆ సినిమాతోనే వెలుగులోకి వచ్చాడు నిఖిల్. ఇప్పుడు ఇంతకాలానికి మళ్లీ అదే ఫ్లేవర్‌లో ఉన్న మరో కథని ఎంచుకున్నాడు. అదే.. కిరాక్ పార్టీ. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరిన్జా కథానాయికలుగా నటించారు. ఈవారంలోనే విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్‌ని బయటకు తీసుకొచ్చారు.
సీన్లు, షాట్లు, అందులోని ఫీలింగ్స్ చూస్తుంటే కచ్చితంగా.. హ్యాపీడేస్ గుర్తొస్తుంది. కాకపోతే అది క్లాసు. ఇది ఊర మాసు. సీనియర్లపై జూనియర్లు చేసే పోరాటం, కాలేజీ లో ర్యాగింగుల గొడవ.. ఇవన్నీ ట్రైలర్లో చూపించారు. సిగరెట్ తాగిన జ్ఞాపకాలు, హాస్టల్లో మందుకొట్టడాలు.. ఇవన్నీ చూస్తుంటే.. ప్రేక్షకుల్ని మళ్లీ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కంటెంట్‌లో కుర్రాళ్లకు కావల్సిన హంగులన్నీ కనిపిస్తున్నాయి. నిఖిల్ కూడా రెండు మూడు గెటప్పుల్లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు. అక్కడక్కడ అర్జున్‌రెడ్డి షేడ్లు కనిపించాయి. కంటెంట్‌లో, టేకింగులో దమ్ముందన్న విషయం అర్థమవుతోంది. చూస్తుంటే.. నిఖిల్ ఖాతాలో మరో హిట్టు ఖాయమే అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.