ఏపీ రాజధాని మార్పు లేదా మూడు రాజధానులపై ఇప్పటివరకు బీజేపీ నేతలు రకరకాలుగా మాట్లాడారు. వారి మాటలు విన్న రాజకీయ పండితులు, మీడియా విశ్లేషకులు, సామాన్య ప్రజలు కూడా ఈ పార్టీకి ఒక విధానం లేదనుకున్నారు. ఎవరికి వారే తాము చెప్పిందే ఫైనల్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులు అంటూ ప్రకటించగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇంకా కొందరు నాయకులు స్వాగతించారు. కాని ఆ తరువాత ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలియదుగాని వ్యతిరేక పంథా తీసుకున్నారు. అప్పటినుంచి అదే స్టాండ్ మీద ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఉద్యమకారులకు మద్దతు పలికారు.
అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో మౌన దీక్ష చేశారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అమరావతి నుంచి ఒక్క అంగుళం కదలించడానికి వీలులేదని, కేంద్ర నాయకులతో మాట్లాడిన తరువాతనే తాను ఈ విషయం చెబుతున్నానని అన్నారు. జగన్ నిర్ణయానికి బీజేపీ వ్యతిరేకత కొనసాగుతున్న దశలోనే బీజేపీ మరో రాజ్యసభ ఎంపీ (ఉత్తరప్రదేశ్ నుంచి), తెలుగోడు అయిన జీవీఎల్ నరసింహారావు హఠాత్తుగా వచ్చి రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోదని, ఇది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పాడు.
పైగా తాను ఐదు రాష్ట్రాలకు అధికారప్రతినిధినని, తాను చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశాడు. కన్నా, ఇతర నాయకులు రాజధాని తరలిపోదని, ఏం భయపడాల్సిన పని లేదని రైతులకు భరోసా కల్పించగా, జీవీఎల్ వైకాపా సర్కారుకు భరోసా ఇచ్చేలా మాట్లాడాడు. దీంతో టీడీపీ నేతలు జీవీఎల్ వైకాపాకు అనధికార ప్రతినిధి అంటూ విమర్శలు చేశారు. జీవీఎల్ చెప్పిదాన్ని కన్నా తీవ్రంగా వ్యతిరేకించి అమరావతిలోనే రాజధాని ఉంటుందంటూ తాను చెప్పిందే ఫైనల్ అన్నారు.
ఈ రగడ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అమరావతికి వచ్చారు. రైతుల ఉద్యమాన్ని చూశారు. వారితో మాట్లాడారు. వారిచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. మరి రైతులకు, ఉద్యమకారులకు ఆయన ఏం చెప్పారు? ‘అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ పోదు’ అని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అన్ని పార్టీల మద్దతుతోనే అమరావతి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారన్నారు.
గతంలో ఇదే కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వచ్చాక కేంద్రం దీనిపై స్పందిస్తుందన్నారు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి మంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం తరపున వచ్చారా? బీజేపీ నాయకులు పిలిస్తే పార్టీ నేతగా వచ్చారా? అనేది తెలియాలి. కిషన్ రెడ్డి హోం శాఖ సహాయమంత్రి. రాష్ట్రాల విభజన, రాజధానుల ఏర్పాటు…ఇలాంటి అంశాలు చూడాల్సిన బాధ్యత హోం శాఖదే. కాబట్టి హోం మంత్రి అమిత్ షా ఆదేశాలమేరకు వచ్చి ఉంటారా? రాజధాని మార్పు విషయమై రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలన్నారు. అంటే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన ఉద్దేశం కావొచ్చు. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనల కారణంగానే ఇంత ఉద్రిక్తత ఏర్పడిందన్నారు. కిషన్రెడ్డి పర్యటన పర్యవసానం ఏమిటో చూడాలి.