గాంధీ సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా భాజపా నాయకులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ముఖ్యోద్దేశం ఏంటంటే… గాంధీజీ ఆశయాలనూ ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయడం అని భాజపా చెప్తూ వచ్చింది. ఉద్దేశం మంచిదే. దానికి తగ్గట్టే భాజపా ఎంపీలందరూ సొంత నియోజక వర్గాల్లో యాత్రలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే బాటలో 150 కిలోమీటర్ల యాత్ర చేశారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో ఆయన యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గాంధీ పేరు పెట్టుకున్నవారు ఆయన గురించి పూర్తిగా మరచిపోయారంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు.
వారు మరచిపోయినా, భాజపా మాత్రం గాంధీ ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు కిషన్ రెడ్డి. ఈ సంకల్ప యాత్రను ఒక రాజకీయ యాత్రగా చూడకూడదని, భాజపా కార్యకర్తలూ నాయకులూ ప్రజల్లోకి వెళ్లి గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలన్నారు. అక్టోబర్ 2ని ఘనంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలన్నారు. మహాత్ముడి ఆశయాలను అందరూ పాటించాలనీ, అప్పుడే మనదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని… ఇలా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
నిజానికి, గాంధీ సంకల్ప యాత్రను భాజపా ప్రారంభించిందే రాజకీయ లబ్ధి కోసం! ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే కాదు… ఏపీలో సుజనా చౌదరిగానీ, మరో రాష్ట్రంలో మరోనేతగానీ… ఇలా యాత్ర చేసిన నాయకులందరూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారు గాంధీని మర్చిపోయారని అంటున్నారు. ఇది రాజకీయ యాత్ర కానప్పుడు… కాంగ్రెస్ మరిస్తే ఏంటి, మరవకపోతే ఏంటి? కేవలం గాంధీయన్ సిద్ధాంతాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు… ఇతర పార్టీలపై విమర్శలు ఎందుకు? గాంధేయవాదాన్ని మాత్రమే ప్రచారం చేయాలనుకున్నప్పుడు… అన్ని పార్టీలనూ కలుపుకుని సంకల్ప యాత్ర చేద్దామని పిలవొచ్చు కదా? అంతటి విశాల దృక్పథం ఎందుకు భాజపాకి లేకుండా పోయింది..? ఇది పక్కా రాజకీయ యాత్ర. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుని భాజపాకి మాత్రమే సొంతం అన్నట్టుగా చేసేసుకున్నారు! మహాత్ముడి పేరును కాంగ్రెస్ మాత్రమే వాడేసుకుంటోందనీ, దాన్ని తమవైపు తిప్పుకోవాలన్న రాజకీయ సంకల్పమే ఈ యాత్ర వెనకున్న ఏకైక ఉద్దేశం అనడంలో సందేహం లేదు. కాబట్టి, ఇది రాజకీయ యాత్ర కాదు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.