తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మక్కీకిమక్కీ కాపీ కొట్టిందని కేటీఆర్ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. పేరు మార్చినంత మాత్రాన అది సొంత ఆలోచన కాదన్నారు. ఇక, ఎంపీ కవిత కూడా ట్వీట్ చేస్తూ… రూ. 6 వేలు మూడు విడతల్లో ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దానిపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వలేదనీ, కేసీఆర్ నాయకత్వ లక్షణాలపట్ల తామంతా మరోసారి సగర్వంగా ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా దీనిపై స్పందిస్తూ…. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దారి చూపించారంటూ మెచ్చుకున్నారు. తెరాస నేతలంతా దాదాపుగా ఇదే మాట ప్రచారం చేస్తున్న సమయంలో… దీన్ని ఖండించేందుకు తెలంగాణ భాజపా నేత కిషన్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు.
కేసీఆర్ కిట్లకు కేంద్రం నిధులిస్తోందనీ, మైనారిటీ అమ్మాయిల పెళ్లిళ్లకు రూ. 50 ఇస్తున్నామనీ, ఫీజు రీఎంబర్స్ మెంటులో కూడా కేంద్రం వాటా ఉందన్నారు కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి నుంచి అన్నీ తీసుకుంటారుగానీ… నరేంద్ర మోడీ పేరు ఎక్కడా చెప్పరని విమర్శించారు. పేరు చెప్పకపోయిన ఫర్వాలేదుగానీ, మోడీపై విమర్శలు కూడా చేస్తుంటారని కిషన్ అన్నారు. పథకాల కాపీ టాపిక్ మీద మాట్లాడుతూ… గుజరాత్ లో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అభివృద్ధి విధానాలను అనే రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. గుజరాత్ కి అధ్యయనం కోసం టీమ్ ని పంపించామని సీఎం కేసీఆర్ చాలాసార్లు అసెంబ్లీలో చెప్పారనీ, కేటీఆర్ కూడా గుజరాత్ వెళ్లొచ్చారన్నారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే ఇలా తీసుకోవడంతో తప్పేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ చుట్టూ తెలంగాణ చుట్టూ జరిగాయనీ… లోక్ సభ ఎన్నికలు మోడీ చుట్టూ దేశం చుట్టూ తిరుగుతాయన్నారు. అప్పుడు తెలంగాణలో కూడా గణనీయమైన మార్పు వస్తుందన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇంతవరకూ చాలా అభివృద్ధి జరిగిందనీ, ఇప్పుడా లాభాలను ప్రజలకు బదిలీ చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
వచ్చాయంటున్న లాభాలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా కిషన్ రెడ్డి చెబితే బాగుండేది. దేన్లో లాభాలు ఇప్పుడు పంచుతున్నట్టు..? గత ఎన్నికలకు ముందు నల్లధనం తీసుకొచ్చి పంచేస్తామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఎంత నల్లధనం వెనక్కి వచ్చిందో తెలీదు! జన్ ధన్ ఖాతాలు తెరిపించి ప్రజలకు ప్రధాని ఏమిచ్చారో కూడా తెలీదు! సరే, ఆ చర్చ అలా ఉంచితే… పథకాలను కాపీ కొట్టడమేంటో అర్థం కాదు! ఆంధ్రాలోనూ ఇదే చర్చ, ఇప్పుడు తెరాస కూడా ఇదే టాపిక్ తెరమీదికి తెస్తోంది. కేంద్ర బడ్జెట్ లో కేసీఆర్ ఆలోచనల విజయాలను వెతుక్కుంటూ… జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర అవసరమనే సర్టిఫికేట్ ని వారికి వారే ఇచ్చుకుంటున్నట్టుగా ఉంది.