తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాల పరిష్కారానికి సిద్ధంగా ఉంటే తానే చొరవ తీసుకుని చర్చలకు ముందుకు వెళదామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జల వివాదాల పరిష్కారానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ అంశంపై ఆలోచించాలన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. సామరస్యంగా జల వివాదాన్ని పరిష్కరించుకోవాలనని .. కేసీఆర్ జగన్, ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ సమస్య పరిష్కారం కోసం తాను పెద్దన్న పోషిస్తాన్నట్లుగా కిషన్ రెడ్డి ప్రకటన చేయడం రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఎలా చూసినా కిషన్ రెడ్డి అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ స్థాయి కానీ లేని నేత. ఆయనకు కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ ఉండి ఉండవచ్చు కానీ కేసీఆర్, జగన్ ఇద్దరూ ఆయనను గొప్ప పవర్ ఫుల్ నేతగా చూడరు. అలాంటి అవకాశమే లేదు. అయినప్పటికీ కిషన్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకుని తాను ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరిస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం రెండు పార్టీల నేతల్లోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే సరిపోతుందనే వాదన ఉంది. కానీ ఆ ఇద్దరూ మాట్లాడుకోకపోవడం వల్లనే సమస్య వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కాదని పెద్దన్నగా భావించి కిషన్ రెడ్డి దగ్గర పంచాయతీ తీర్చుకోవడం అనేదే ఊహకందని విషయం. అపెక్స్ కౌన్సిల్లోనేవారి పంచాయతీ తేలలేదు. సుప్రీంకోర్టులో తేల్చుకుందామని డిసైడయ్యారు. అయినా కిషన్ రెడ్డి పెద్దరికాన్ని తనకు తాను ఆపాదించుకుని ఇలా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కిషన్ రెడ్డి అంశాన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా లేక లైట్ తీసుకుంటాయా అన్నది వేచి చూడాలి.