అమరావతి రాజధాని మార్పుపై.. భారతీయ జనతా పార్టీ స్పందన కీలకంగా మారింది. అయితే.. బీజేపీ నేతలు.. ఏపీలో ఓ రకంగా.. కేంద్రం వద్దకు వచ్చే సరికి మరో విధంగా స్పందిస్తున్నారు. అమరావతి మార్పు వార్తలు.. తెలుగు రాష్ట్రాలకు ఏకైక కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి .. ఆచితూచి స్పందించారు. ఏపీ రాజధాని విషయంలో… కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ప్రకటించారు. అసలు ఏపీ రాజధాని అంశం కేంద్ర పరిధిలోకే రాదని .. తేల్చేశారు. రాజధాని మార్పు కోసం.. ఏపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని… ఇందు కోసం.. కేంద్రంలోని బీజేపీ మద్దతు కోరుతోందని వస్తున్న విమర్శల నేపధ్యంలోనే.. కిషన్ రెడ్డి అత్యంత జాగ్రత్తగా స్పందించారు.
అయితే.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం.. జగన్ ను తుగ్లక్ అనేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి.. ఒకింత ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నయని … కొన్ని నిర్ణయాలు పిచ్చితుగ్లక్ చర్యలను గుర్తుచేస్తున్నాయని మండిపడ్డారు. ఒక్క అమరావతి మాత్రమే కాదు… అన్ని నిర్ణయాలు ఇలానే ఉన్నాయన్న అభిప్రాయాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. అన్నాక్యాంటీన్లు సరిగాలేకుంటే మార్పులు చేయాలి కానీ మూసివేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రం, పీపీఏ సూచనలు, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా.. పోలవరం టెండర్లు రద్దుచేయడం తుగ్లక్ చర్య కాక మరేమిటని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై… ఎలా స్పందించాలో.. భారతీయ జనతా పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు. కేంద్ర సర్కార్ కూ అదే తంటా వచ్చి పడింది. రాజధాని తరలింపును.. సమర్థిస్తే.. ఓ ఇబ్బంది.. సమర్థించుకపోతే.. మరో ఇబ్బంది అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. అందుకే కిషన్ రెడ్డి ఆచితూచి స్పందించారు. తమకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కల్పించుకుంటే.. తమపై లేనిపోని నిందలు వస్తాయనుకుంటున్న బీజేపీ రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకించి.. కేంద్ర స్థాయిలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.