ఇల్లు అలకగానే పండుగ కాదనీ, ముందుంది ముసళ్ల పండుగ అంటూ ఓరకమైన హెచ్చరిక లాంటి వ్యాఖ్యే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంపై అనవసరంగా విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి మాట్లాడుతూ… కార్మికులను సస్పెండ్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేంద్రం చేసిన చట్టం ప్రకారమే తాము చేస్తున్నామని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం మంచిది కాదనీ, కేసీఆర్ ముందున్నది ముసళ్ల పండుగ ఉందని మరోసారి చెప్పారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారంపై భాజపా నజర్ పెట్టిందనే కథనాలు వచ్చాయి. అంతేకాదు, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడంతో, ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణను కమలం పార్టీ అమల్లోకి తెచ్చే అవకాశాలున్నట్టుగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి చేస్తున్న ఈ ముసళ్ల పండుగ వ్యాఖ్య వెనక అంతరార్థం కూడా అదే అన్నట్టుగా వినిపిస్తోంది. నిజానికి, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే భాజపాకి కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు రావడంతో జోరు పెంచింది. త్వరలో మరోసారి చేరికల వేగం పెంచడంతోపాడు, తెలంగాణలో కేసీఆర్ సర్కారు తీరుపై అసంతృప్తిగా ఉన్న కులాలను ఐక్యం చేసే ప్రణాళికను భాజపా అమ్మలోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
తెలంగాణలో భాజపాకి కనిపిస్తున్న మరిన్ని సానుకూలతలు ఏంటంటే… 12 శాతం ముస్లిం జనాభా ఉంది, ఇక్కడ ఎమ్.ఐ.ఎమ్. ఇప్పుడు అధికార పార్టీతో దోస్తీలో ఉంది, లోక్ సభ ఎన్నికల తరువాత కొంతమంది నేతల్ని విరివిగా చేర్చుకుంది, గ్రామీణ తెలంగాణలో కొంత భాజపాపై సానుకూలత, అన్నిటికీమించి కేంద్రంలో అధికారంలో ఉండటం. ఇవన్నీ వాడుకుని రాష్ట్రంలో బలపడే వ్యూహాలకు పదునుపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోటి… రాష్ట్రంలో జాతీయ అజెండాని ప్రధాన ప్రచారాస్త్రంగా భాజపా మార్చుకుంటే మాట్లాడే అవకాశం తెరాసకు లేకుండా పోయే అవకాశమూ ఉంది! ఎలా అంటే, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అంశమై తెలంగాణలో రేప్పొద్దు ఏదైనా ఎన్నికల్లో భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే… దాన్ని తెరాస ఖండించలేదు. ఎందుకంటే, పార్లమెంటులో భాజపాకి మద్దతు ఇచ్చారు కదా. అయోధ్య రామమందిర నిర్మాణానికి కేసీఆర్ అనుకూలమా అని భాజపా ప్రశ్నిస్తే… ఎమ్.ఐ.ఎమ్. స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని స్పందించలేని పరిస్థితి తెరాసకి రావొచ్చు. అంతేకాదు, భాజపా తీసుకున్న చాలా కీలక నిర్ణయాలన్నింటినీ కేసీఆర్ సమర్థిస్తూనే వచ్చారు. అదే బలహీనతగా మారే అవకాశమూ ఉంది. కాస్త దూరదృష్టితో విశ్లేషించుకుంటే… భాజపా వల్ల తెరాసకు భవిష్యత్తులో ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.