తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కిషన్ రెడ్డి నిర్మోహమాటంగా ఖండించారు. కేసీఆర్ ను కల్వకుంట్ల కరప్షన్ రావు గా అభివర్ణిస్తూ వీడియో రిలీజ్ చేశారు. బీజేపీతో పొత్తుల విషయంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో అనేక రకాల ప్రచారాలు ప్రారంభమైనా బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఎవరూ స్పందించలేదు. పొత్తులపై అసలు మాట్లాడవద్దని నేతలను అతర్గతంగా ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
అయితే స్వయంగా కిషన్ రెడ్డి కూడా ఖండించడంతో పాటు కేసీఆర్ పై ఆరోపణలు చేయడంతో.. బీఆర్ఎస్ గట్టిగా రివర్స్ కౌంటర్ ఇస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదు. పైగా కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల కోసం బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ నేతలంటున్నారు. బీజేపీ హైకమాండ్‌కు ప్రతిపాదనలు వెళ్లాయని ఆ ప్రతిపాదనలపై అంతర్గత చర్చ కూడా జరిగిందని చెబుతున్నారు. కానీ రాష్ట్ర ముఖ్య నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. తెలంగాణలో పొత్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నేరుగా చెప్పినట్లయింది. అయితే కేసీఆర్ మాత్రం పొత్తులు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారంటున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమని బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకుని ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు. అలాంటిదేమీ లేదని బీఆర్ఎస్ తో పొత్తుల ఆలోచన అసలు చేయడం లేదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంతో స్పష్టత వచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేయబోతున్నారు.