తెలంగాణ బీజేపీలో జరుగుతన్న వర్గ పోరులో కిషన్ రెడ్డిదే పైచేయి అయింది. ఆయన జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకోవడంతో .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేయాలని తలపెట్టిన పాదయాత్రను వాయిదా వేయక తప్పలేదు. ఈ నెల 9వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని బండి సంజయ్ ముందుగా నిర్ణయించుకున్నారు. ఇందు కోసం పార్టీ పరంగా కమిటీలు నియమించారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే అనూహ్యంగా కిషన్ రెడ్డి.. తాను జన ఆశీర్వాద్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ జనఆశీర్వాద్ యాత్ర.. కిషన్ రెడ్డి సొంతంగా నిర్ణయించుకుది కాదు. హైకమాండ్ నిర్దేశించింది. కొత్త మంత్రులందరూ ప్రజల్లోకి వెళ్లడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఒక్కో కేంద్రమంత్రి మూడు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేసేలా పర్యటనలు చేయనున్నారు. ఆగస్టు పదహారు నుంచి మూడురోజుల పాటు యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు ఎంపీలు అందరూ అందుబాటులో ఉండాలని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేయడంతో బండి సంజయ్‌కు మరో మార్గం లేకుండా పోయింది. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్.. తారాజువ్వలా దూసుకు వచ్చారు. ఘాటైన వ్యాఖ్యలతో కేసీఆర్‌పై విరుచుకుపడి… ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు.
అయితే ఎప్పుడైతే ఆయన ఎదుగుదల చాలా ఫాస్ట్‌గా జరిగిందో.. అది పార్టీలోని ఇతర సీనియర్లకు ఆయనను దూరం చేసింది. అప్పటి నుండి బండి సంజయ్‌కు గడ్డు కాలం వచ్చింది. ఆయన ఏం చేద్దామనుకున్నా కలసి రావడం లేదు. కిషన్ రెడ్డితో ఆయనకు పొసగడం లేదన్న ప్రచారం కూడా ప్రారంభమయింది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర సాధ్యం కాదన్న చర్చ నడుస్తోంది. ఈ లోపే ఆయన ప్రారంభించతలపెట్టిన పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 24వ తేదీన పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన చెబుతున్నారు కానీ అది సాధ్యం కాదని బీజేపీ నేతలే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది.