విశాఖ రాజధాని అని కిషన్ రెడ్డి అన్నారని.. బీజేపీ తన స్టాండ్ మార్చుకుంటోందని నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రో వైసీపీ మీడియా ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే ఈప్రచారంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ మాధవ్ ఎన్నికలప్రచారానికి సంబంధించిన పాత్రికేయ సమావేశంలో రోజురోజుకూ అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ వస్తున్నటువంటి విశాఖపట్టణం వంటి జిల్లా కేంద్రంలో మాధవ్ లాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్సీగా గెలిపించుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనిచెప్పడం జరిగిందన్నారు
.విశాఖ పట్టణం రాజధాని మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదని కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని మా పార్టీ ఇదివరకే చాలా స్పష్టతనిచ్చింది. మేము, మా పార్టీ నాయకులంతా కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సు కోసం వచ్చిన కిషన్ రెడ్డి మొదట పార్టీ పనులు చూసుకున్నారు.
ఈ క్రమంలో ఆయన విశాఖ రాజధాని అంటూ నోరు జారడంతో ఆయన పర్యటన మోటో మొత్తం దెబ్బతిన్నది. అసలు అమరావతిని నిర్వీర్యం చేయడంలో బీజేపీ పాత్ర ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో కిషన్ రెడ్డి విశాఖ రాజధాని అంటూ కామెంట్ చేయడం.. మళ్లీ తన ఉద్దేశం అది కాదంటూ కవర్ చేసుకోవడంతో బీజేపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఎంత కవర్ చేసుకున్నా ఆయన మాటల్ని ఉపయోగించుకుని రెచ్చిపోయే రాజకీయ నాయకత్వం ఏపీలో ఉంది. ఇంత కాలం రాజకీయాల్లో ఉన్న కిషన్ రెడ్డికి ఈ మాత్రం జాగ్రత్త లేకపోతే ఆ పార్టీ ఎలా ఎదుగుతుంది ?