తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నిన్న చాలా వాదోపవాదాలు సాగాయి. తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా తన మంత్రులను, స్థానిక ప్రజా ప్రతినిధులను వెంటబెట్టుకొని రైతులను కలుస్తూ వారిలో ఆత్మస్థైర్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయనలాగే స్వయంగా తన మంత్రులను,స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రతిపక్ష పార్టీ నేతలను వెంటబెట్టుకొని రైతులను కలిసి వారికి భరోసా కల్పించాలని సూచించారు. కేసీఆర్ అందుకు అంగీకరిస్తే ఆయన వెంట రావడానికి తామంతా సిద్దంగా ఉన్నామని కిషన్ రెడ్డి సభాముఖంగా చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న అప్పులపై కొంతకాలం మారిటోరియం విధించాలని ఆయన సూచించారు.
కిషన్ రెడ్డి చాలా మంచి సలహాలే ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ దానిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి ప్రయత్నం చేయకుండా, ఆత్మహత్యల నివారణకి మంచి సలహాలు ఇవ్వడమే కాకుండా, తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన ముఖ్యమంత్రితో కలిసి రైతుల వద్దకు వెళ్లేందుకు కూడా ఆయన సిద్దపడ్డారు. అంతేకాదు బీజేపీ పాలిత మహారాష్ట్రలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారనే విషయాన్ని నిజాయితీగా ఒప్పుకొని, ఆ సమస్యను అధిగమించడానికి అక్కడి ముఖ్యమంత్రి ఎటువంటి విధానం అమలు చేస్తున్నారో తెలియజేసారు. అప్పులపై మారిటోరియం విధించాలనే ప్రతిపాదన కూడా చాలా మంచి ఆలోచనే. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు తీసుకొన్న అప్పులపై మారిటోరియం విధించే అవకాశం లేనప్పటికీ బ్యాంకుల నుండి తీసుకొన్న అప్పులపై కొంతకాలం మారిటోరియం విధించవచ్చును. తద్వారా రైతులపై ఒత్తిడి తగ్గుతుంది. స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా వడ్డీ వ్యాపారులపై కూడా ఒత్తిడి తెచ్చి రైతులను వేదించకుండా అడ్డుకోవచ్చును.
ఈ సమస్య పరిష్కారానికి ప్రతిపక్షాలు మంచి సలహాలు, సూచనలు చేసినట్లయితే వాటిని తప్పకుండా పాటిస్తామని చెపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కిషన్ రెడ్డి ఇచ్చిన ఈ సలహాను పాటిస్తే బాగుంటుంది. రైతుల కోసం కిషన్ రెడ్డి ఏవిధంగా రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వంతో సహకరించేందుకు ముందుకు వచ్చేరో, అదే విధంగా తెరాస ప్రభుత్వం కూడా రాజకీయాలను పక్కనబెట్టి ప్రతిపక్షాలను కలుపుకుపోయి పనిచేయగలిగితే సున్నితమయిన ఈ సమస్య పరిష్కారం కావచ్చును. నిత్యం రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే గత ప్రభుత్వాలు అందుకు బాధ్యులని నిందిస్తూ కాలక్షేపం చేయడం వలన ఆత్మహత్యలు ఆగవు. పైగా ప్రభుత్వానికి తీరని అప్రదిష్ట కలుగుతుంది. తెరాసపై ప్రజలు పెట్టుకొన్న నమ్మకం సడలుతుంది. రైతుల సమస్యల పరిష్కారానికి ఒకవైపు తగిన చర్యలు తీసుకొంటూనే మరోవైపు కిషన్ రెడ్డి సూచిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతులను కలిసి వారిలో నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేయాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి.