తెలుగోళ్లకు వారి మాతృభాష సరిగా రాకపోయినా ఫర్వాలేదుగాని హిందీ, ఇంగ్లీష్ బాగా వస్తే చాలు ఇండియాలో ఎక్కడైనా చెలాయించుకొని రావచ్చు. ఇది కరెక్టేగాని మన దేశంలో ఒకే భాషలో అనేక యాసలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిస్తుంది. తెలంగాణ ప్రజల తెలుగుకు, ఏపీ ప్రజలకు తెలుగుకు ఎంత తేడా ఉందో మనకు తెలుసు. ఏపీలోనూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, నెల్లూరు. గోదావరి జిల్లాల తెలుగుకు చాలా తేడా ఉంది. అలాగే తెలంగాణలోనూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు, ఇతర జిల్లాలకు యాసలో తేడా ఉంది. అంటే అందరూ మాట్లాడేది తెలుగు అయినా ఒకరిది మరొకరికి అర్థం కాదు. హైదరాబాదులో తరాల కిందటే స్థిరపడిన కొంతమందికి హిందీ అసలే రాదు. పక్కా హైదరాబాదీలకు అంటే హైదరాబాదులోనే లేదా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టి పెరిగినవారికి హిందీ బాగా వస్తుంది.
అయితే ఇక్కడి హిందీని దక్కనీ హిందీ అంటారు. అంటే ఎక్కువగా ఉర్దూ పదాలు మిళితమై ఉంటాయి. ఇక్కడ సుదీర్ఘకాలం నవాబులు పరిపాలించారు కాబట్టి ఇక్కడి హిందీ ఉత్తర భారతదేశంలోని హిందీ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ హిందీ అక్కడివారికి త్వరగా అర్థం కాదు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి హిందీయే సమస్యగా మారిందట….! ఆయనకు హిందీ సమస్యగా మారడమేమిటి? ఆయన పక్కా హైదరాబాదీ కదా అని మనం అనుకోవచ్చు. మరి ఆయన ఇప్పుడు మంత్రి కదా. పార్లమెంటులో వివిధ సందర్భాల్లో మాట్లాడాల్సివుంటుంది. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. హోం మంత్రి అమిత్ షా లేనప్పుడు సభ్యులు ఏదడిగినా ఈయనే చెప్పాలి కదా. ఇలాంటి సందర్భాల్లో కిషన్ రెడ్డి హిందీ ఉత్తరాది సభ్యులకు అర్థంకావడంలేదట…! ఈయన మాట్లాడేది వారికి సరిగా అర్థం కాకపోవడంతో అది ఈయనకు ఇబ్బందిగా మారింది.
కిషన్‌రెడ్డికి హిందీ ఎంత బాగా వచ్చినా యాక్సెంట్లో తేడా ఉండొచ్చు. ఉత్తరాది ఎంపీలు ప్రధాని మోదీ దగ్గర, హోం మంత్రి అమిత్ షా దగ్గర ఫర్రాగా హిందీలో మాట్లాడుతుంటే కిషన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈయన ఉత్తరాది హిందీ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటారని సమాచారం. తెలంగాణ నాయకులు చాలామంది మంచి హిందీ మాట్లాడగలరు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నాయకులకు హిందీ సమస్యే కాదు. ఇక హైదరాబాదులోనే పుట్టిపెరిగిన హైదరాబాదీలకు భాషా సమస్య సాధారణంగా ఉండదు. మరి కిషన్‌రెడ్డికి ఈ సమస్య ఎందుకు వచ్చిందో…! పార్లమెంటులో చాలామంది ఎంపీలకు భాషా సమస్యలు (హిందీ, ఇంగ్లిష్) ఉన్నాయి.
కొందరు తమ మాతృభాషలో తప్ప హిందీలోగాని, ఇంగ్లిషులోగాని మాట్లాడలేరు. ఏపీ ఎంపీలు ఇంగ్లిషులో మాట్లాడగలరుగాని హిందీలో మాట్లాడలేరు. ఇందుకు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మినహాయింపు. అతను హిందీలో అనర్గళంగా మాట్లాడతాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడైనా ఢిల్లీలో చదువుకున్న కారణంగా ఉత్తరాదివారి మాదిరిగా మాట్లాడగలడు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఉన్నప్పుడు లోక్‌సభలో చక్కటి హిందీలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడు భాషా సమస్యను ఎదుర్కొన్నారు. ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు.
పార్లమెంటులో ఏ భాషలో మాట్లాడినా అనువాదం చేసే అవకాశం ఉంది కాబట్టి కొందరు తమ మాతృ భాషల్లోనే మాట్లాడుతుంటారు. సామాన్యుల సంగతి అలా పక్కనుంచితే రాజకీయ నాయకులకు హిందీ పరిజ్ఞానం చాలా అవసరం. రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ఎంపీలుగా కూడా పోటీ చేయిస్తుంటాయి కాబట్టి గెలిచి ఢిల్లీకి వెళితే వారు హిందీలో మాట్లాడటం, వేరే ఎంపీలు హిందీలో మాట్లాడితే అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి హిందీ కాదనుకొని రాజకీయాల్లో రాణించడం కష్టం.