కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ఎందుకు టీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారో కానీ.. ఆయన ఇష్టం లేని పదవిని అంతే అనాసక్తంగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా బీజేపీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారుతోంది. అసలే బలమైన అభ్యర్థులు లేరనుంటే.. మొదటి జాబితా తర్వాత ఉన్న నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని కల్పించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి అనే నేతతో రాజీ చేసుకుంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి టిక్కెట్ ఆశించిన మాజీ ఎంపీ వివేక్‌కు బీజేపీ అక్కడ కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ స్థానాన్ని కేటాయించింది. దీంతో ఆయన పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా బీజేపీని వీడే అవకాశాలు ఉన్నాయి. మునుగోడు లేదా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి తనకు టిక్కెట్ కేటాయించాలంటూ ఆయన కోరారు. ఆ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ ఆయనకు టిక్కెట్ ఎక్కడిస్తారో చెప్పడంలేదు.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి… ఇద్దరూ పార్టీకి తలనొప్పిగా మారారు. గద్వాలలో సీనియర్ న్యాయవాది అయిన వెంకటాద్రి రెడ్డిని నిలబెట్టి… తనకు ఎంపీగా అవకాశమివ్వాలని అరుణ కోరుతున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు మిథున్‌రెడ్డికి షాద్‌నగర్ అసెంబ్లీని కేటాయించి, తనకు లోక్‌సభకు అవకాశం కల్పించాలంటూ జితేందర్‌రెడ్డి కోరుతున్నారు. కానీ ఆయన్ను శాసనసభకు పోటీ చేయాలని హైకమాండ్ కోరుతోంది. కానీ తాను చేయనని ఆయన తెగేసి చెప్పారు. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
టిక్కెట్లు ప్రకటించినప్పుడు ఇలాంటి అసంతృప్తులు సహజంగానే ఉంటాయి. కానీ వీరిని ఎవరినీ బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.