కేంద్రమంత్రివర్గంలో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారెవరికీ.. చోటు దక్కే అవకాశం లేదు. మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు.. ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభసభ్యుడు అయినందున.. ఆయననే… ఏపీకి సంబంధించిన కేంద్రమంత్రిగా అనుకునే అవకాశం ఉంది. ఒక వేళ జీవీఎల్ నరిసింహారావుకు కేంద్రమంత్రి పదవి ఇచ్చినా అది యూపీ కోటాలోకి వెళ్తుంది. ఎందుకంటే.. ఆయన అక్కడ్నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి మాత్రం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకొరికి చాన్స్ ఇస్తారా లేదా.. అన్న చర్చ మాత్రం నడుస్తోంది.
ఆశల పల్లకీలో నలుగురు తెలంగాణ ఎంపీలు..!
మరికొద్ది గంటల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. మోదీ క్యాబినెట్లో ఎవరనే చర్చ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నడుస్తోంది. తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం మోదీ క్యాబినెట్ లో బెర్త్ కోసం ఆశగా ఢిల్లీ బాట పట్టారు.
గురువారం సాయంత్రం ఢిల్లీలో నరేంద్ర మోదీ రెండోసారి పధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కూర్పు, కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే దానిపై బీజేపీ చీఫ్ మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. ఏ మంత్రిత్వ శాఖ ఎవరకీ.. అనేదానిపై ఇప్పటికే మోదీ, షాలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ, బెంగాల్లో బీజేపీ గెలుపు ప్రభావం కేంద్ర మంత్రి వర్గంలో కన్పించనుందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన మంత్రులతో పాటు.. కొత్త వారికి కూడా అవకాశం ఉంటోందని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు.
కిషన్ రెడ్డి కేబినెట్ హోదా ఖాయమే..?
తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అయితే కేంద్ర క్యాబినెట్లో తెలంగాణకు ప్రాతినిధ్యంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటకీ.. సీనియర్ నేత కిషన్ రెడ్డి కి ఖచ్చితంగా మోదీ క్యాబినెట్లో స్థానం దక్కుతోందని తెలుస్తోంది. గతంలో మూడు సార్లు ఉమ్మడి ఏపీ, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి పనిచేశారు. మోదీ గుజరాత్ సీఎం కాకముందు.. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు.. కిషన్ రెడ్డి బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా మోదీతో కలసి పనిచేశారు. ఈ బంధం కూడా కిషన్ రెడ్డికి కలసివస్తోందని భావిస్తున్నారు.
మరో అదృష్టవంతునికి చాన్స్ ఉందా..?
బీజేపీ తర్వాత లక్ష్యం తెలంగాణనే అనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే మరొకరికి కూడా సహాయమంత్రి పదవి వస్తోందని ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డితో పాటు.. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ఎంపీలుగా గెలిచారు. అయితే దక్షిణాది నుంచి ఆదివాసీ కోటలో సోయం బాపురావు పదవి వస్తోందని ఆశిస్తున్నారు. తెలంగాణలో బీసీల్లో బలమైన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన బండి సంబయ్, ధర్మపురి అరవింద్ లు సైతం అదృష్టం కలసివస్తే కేంద్రమంత్రి పదవి వస్తోందని భావిస్తున్నారు. మెదట నుంచి ఆర్ఎస్ఎస్ లో బండి సంజయ్ పనిచేస్తున్నారు. కవితపై గెలుపొందటం అరవింద్ కు కలసివస్తోంది.
కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే ప్రమాణం చేస్తారా.. లేక ఇద్దరు చేస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.