ఆంధ్రప్రదేశ్లో జన ఆశీర్వాద్ యాత్ర చేయడానికి విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీకి ఆహ్వానించారు. ముందుగా షెడ్యూల్లో లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లారు. ముందుగా ఆయన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నారు. దర్శనం తర్వాత ఆయన సీఎం ఇంటికి వచ్చారు. ఈ సందర్భంలో కారు ఎక్కుతున్న సమయంలో ఆయన తలకు డోర్ బలంగా తగిలింది. దీంతో నుదుటిపై గాయం అయింది.
అక్కడిక్కడే ప్రాథమిక చికిత్స తీసుకున్న కిషన్ రెడ్డి సీఎంతో భేటీ కోసం తాడేపల్లికి వచ్చారు. సీఎంవో విడుదల చేసిన ఫోటోల్లో కిషన్ రెడ్డి తలకు గాయం కనిపిస్తోంది. కిషన్ రెడ్డికి సీఎం వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చినందునే మర్యాదపూర్వకంగా ఆహ్వానించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కిషన్ రెడ్డితో కలిసి జగన్ భోజనం చేశారు.
సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారని.. ఇందులో రాజకీయం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువాడికి పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా కేంద్రంలో అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నరేంద్రమోడీకి రెండు కళ్లులాంటివని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కిషన్ రెడ్డి పర్యటన గురించి తెలిసినా చివరి క్షణంలో కిషన్ రెడ్డిని చివరి క్షణంలో జగన్ ఇంటికి ఆహ్వానించడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి.