హైదరాబాద్లో హెచ్సీయూని ఆనుకుని ఉన్న నాలుగు వందల ఎకరాల భూముల్ని వేలం వేసి ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలనుకుంటున్న రేవంత్ రెడ్డికి అతంత సులువు కాదని ఎదురుగా వస్తున్న ఆటంకాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే ఆ భూముల్ని అమ్మవద్దని.. అక్కడ ఉన్న పర్యావరణాన్ని కాపాడాలని చాలా మంది ఉద్యమం ప్రారంభించారు. తాజాగా కిషన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారు. అక్కడ చాలా వన్యప్రాణులు, వృక్ష సంపద ఉన్నాయని వాటిని ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ చేయవద్దని లేఖ రాశారు.
ఈ లేఖ రాసింది కేంద్ర కేబినెట్ మంత్రి. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో లేకపోతే బీజేపీ నేత హోదాలో … రాజకీయం కోసం రాసి ఉండవచ్చు.కానీ ఆ భూముల్ని వేలం వేయకుండా అడ్డుకోగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆ భూమి పూర్వకాలంలో హెచ్సీయూదని చెబుతున్నారు. కానీ అధికారికంగా యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వానికే ఉన్నాయి. అక్కడ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐఎంజీ సంస్థకు కేటాయించారు. కానీ ప్రభుత్వం మారడంతో ఆరోపణలు, రాజకీయాలు కారణంగా అక్కడ స్పోర్ట్స్ సిటీ లాంటిదేమీ రాలేదు. అప్పట్నుంచి ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి.
ఆ ఖాళీ స్థలంలో వనం పెరిగిపోయింది. ఇప్పుడు దాన్ని చూపించి ఆ స్థలాన్ని అమ్మవద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మిగతా అన్నింటి కంటే పర్యావరణం అన్న డిమాండ్ చాలా సున్నితమైనది. అందుకే ఈ అంశంలో అందరూ అదే టాపిక్ మీదకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంత మంది ప్రముఖులు ఇప్పటికే అక్కడ చెట్లు కొట్టేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అదే అంటున్నారు. అంటే పర్యావరణ ఆటంకాలు దాటి ఆ భూముల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మడం అంత తేలిక కాదని అనుకోవచ్చు.