బీజేపీలో చేరేందుకు కేసినో కింగ్.. హవాలా కింగ్ గా పేరు ఉన్న చీకోటి ప్రవీణ్ హంగామాతో బీజేపీ ఆఫీసుకు చేరుకున్నాడు. కొంత మంది అడ్డా కూలీల్ని వెంటేసుకుని.. బ్యాండ్ మేళాన్ని మాట్లాడుకుని ఆయన నాంపల్లి బీజేపీ ఆఫీసుకు వచ్చారు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఖంగుతిన్నారు. నిజానికి ఆయన అన్నీ మాట్లాడుకునే వచ్చారు. కిషన్ రెడ్డితో మాట్లాడుకుని పార్టీలో చేరే టైం ఫిక్స్ చేసుకున్నారు. దానికి తగ్గట్లుగా వచ్చారు.
కానీ చివరి క్షణంలో కిషన్ రెడ్డి హ్యాండిచ్చారు. చీకోటి ప్రవీణ్ గురించి .. ఆయన చరిత్ర గురించి.. ఆయనపై ఉన్న ఈడీ కేసుల గురించి హైకమాండ్ కు పదే పదే సమాచారం పంపడంతో చివరికి అక్కడ్నుంచి వచ్చిన సూచనలతో కిషన్ రెడ్డి చీకోటి ప్రవీణ్‌కు కాషాయం పూయడం ఆపేశారని తెలంగాణ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అసలు చీకోటి ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాల్సింత కరువు ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. బీజేపీలో చేరడానికి ఎవరూ లేరు. చివరికి ఎవరో ఒకర్ని చేర్చుకోవాలన్నట్లుగా సీన్ మరిపోయింది. చీకోటి ప్రవీణ్ … హంగామాగా వచ్చి చూసేసరికి ఎవరూ లేకపోవడంతో.. నిరాశపడ్డారు.
బీజేపీలో చేరాలనే వచ్చానని కానీ.. ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరూ లేకపోవడంతో వెళ్లిపోతున్నానని చెప్పుకొచ్చారు. చీకోటి ప్రవీణ్ అసలు బీజేపీలో ఎందుకు చేరాలనుకున్నారో అందరికీ తెలుసు. అయినా అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని ఎలా పార్టీలో చేర్చుకోవాలని కిషన్ రెడ్డి అనుకున్నాడో ఆయనకే తెలియాలని .. బీజేపీ నేతలు సెటైర్లు వేస్తన్నారు.