కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని గాలికొదిలి తన 150వ సినిమా నిర్మాణంపైనే శ్రద్దపెట్టినందుకు రాహుల్ గాంధీ మెత్తగా చివాట్లుపెట్టి, ఆ సినిమాని పక్కనబెట్టి పార్టీని బలోపేతం చేయమని ఆదేశిస్తే, అందుకు బాధపడిన చిరంజీవి పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరాలనుకొంటున్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చిరంజీవిని రాహుల్ గాంధీ అంత మాటన్నారో లేదో తెలియదు కానీ, అదే మాట కాంగ్రెస్ నేతలు, రాష్ట్రంలో కాంగ్రెస్ దుస్థితిని చూస్తున్న ప్రజలు కూడా అనుకొంటున్నారు. తనకున్న అపార ప్రజాధారణపై నమ్మకంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలోకి వచ్చారు. కానీ రాజకీయాలలో రాణించడం టాగూర్ సినిమా చేసినంత తేలిక కాదనే సంగతి ఎన్నికలు మధ్యలోనే అర్ధమయిపోయింది.
రాజకీయాలలో నిలద్రొక్కుకోవడానికి తన ఇమేజ్ ఒకటే సరిపోదనే విషయం కూడా గ్రహించడంతో తన గుప్పెడు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని కాంగ్రెస్ టైటానిక్ షిప్ లోకి ఎక్కేశారు. అందులో ఆయనకు సోనియా గాంధీయే మంచి ‘క్యాబినే’ ఇచ్చారు. కానీ ఎన్నికల తుఫానులో చిక్కుకొన్న ఆ టైటానిక్ షిప్ మోడీ అనే మంచు కొండని డ్డీ కొనడం, అదే సమయంలో దానికి రాష్ట్ర విభజన అనే చిల్లు పడటంతో చిరంజీవి ఎంతో ముచ్చటపడి ఎక్కిన ఆ టైటానిక్ షిప్పు కాస్త మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ షిప్పు మహా కెప్టెన్ సోనియాగాంధీ షిప్పులో ఉన్న సీనియర్ కెప్టెన్స్ అందరినీ పక్కన బెట్టి చిరంజీవిని కెప్టెన్‌ని చేసి రాష్ట్రంలో ఆ టైటానిక్ షిప్పుని ఒడ్డుకు చేర్చే బాధ్యత అప్పగించారు. కానీ ఆయన ఎక్కింది టైటానిక్ షిప్పు గనుక అది ఎన్నికలో తుఫానులో చిక్కుకొని సగం మునిగిపోయింది.
కానీ సోనియాగాంధీ ఇదివరకే ఇచ్చిన లైఫ్ బోట్ (రాజ్యసభ సీటు) తో చిరంజీవి సేఫ్ గా ‘టాలీఒడ్డు’కు చేరుకోగలిగారు. పోయిన చోటే ఉంగరం వెతుక్కోవాలి కనుక ఒడ్డున పడిన ఆజీవి తన తన 150వ సినిమా దృష్టి పెట్టారు. మునిగిపోతున్న టైటానిక్ షిప్పులో నిలబడి చేతులు ఊపుతున్న వైస్-కెప్టెన్ రాహుల్ గాంధీని పట్టించుకోలేదు.అందుకు ఆయన చిరంజీవి మీద కోప్పడం సహజమే. అందుకే చిరంజీవిని ఓ మాటని ఉండవచ్చును. కానీ స్వయం కృషితో ఒడ్డున పడ్డ చిరంజీవికి కూడా కోపం రావడం సహజమే. ఇంకా సముద్రంలో (రాజకీయాలలో) షికారు చేయాలనే ముచ్చట తీరకపోవడంతో ఒడ్డున లంగరు వేసి ఉన్న లగ్జరీ క్రూయిజర్ (బిజేపీ)లోకి ఎక్కాలనుకొంటే అది కూడా తప్పు కాదు. ఆ షిప్పులో ఉన్న లోకల్ కెప్టెన్ కిషన్ రెడ్డి చిరంజీవి తమ షిప్పు ఎక్కుతానంటే ఎర్ర తివాచీ వేసి ఆహ్వానిస్తామని అన్నారు. అటువంటి ఆట, పాట తెలిసి నలుగురిని ఆకర్షించగల వ్యక్తి వస్తే మాకు మంచి కాలక్షేపం అవుతుంది. ఎన్నికల సమయంలో ఒడ్డుకు వచ్చినప్పుడు జనాలని ఎంటర్ టెయిన్ చేయడానికి పనికి వస్తారని చెప్పినట్లు సమాచారం. కానీ తానెక్కివచ్చిన టైటానిక్ షిప్పు మునిగిపోతుంటే, దానినే పట్టించుకోకుండా స్టెప్పులు వేస్తున్నవాడు, ఈ కొత్త షిప్పుని పట్టించుకొంటాడా? అని కిషన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు లేదు.