వచ్చే నెలాఖరున జి.హెచ్.ఎం.సి.ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో తెదేపా, బీజేపీలు కలిసి పోటీ చేయాలని నిశ్చయించుకొన్నాయి. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున కూడా అభ్యర్ధులను నిలబెడితే బాగుంటుందని తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి సూచించారు. ఈ ఎన్నికలలో తెదేపా, బీజేపీలు తప్పకుండా విజయం సాధిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన అభ్యర్ధులను పోటీలో నిలబెడితే వారికి మద్దతు ఇస్తామని తెలిపారు. కిషన్ రెడ్డి అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ కి ఇటువంటి ప్రతిపాదన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా అది బీజేపీ నేతల్లో ఆత్మవిశ్వాసం లోపించిందని తెలియజేస్తున్నట్లుంది.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికల కోసం సుమారు ఏడాదిపాటు గట్టిగా కసరత్తు చేసిన అధికార తెరాస, వరంగల్ ఉపఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత, మజ్లీస్ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోకుండా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడున్న హైదరాబాద్ నగరంలో తెరాస పోటీ చేసి గెలవలేదని ఇంతవరకు అందరూ అభిప్రాయపడుతుండేవారు. కానీ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి 150 సీట్లలో కనీసం 80 సీట్లు గెలుచుకొంటామని తెరాస చెప్పడం దాని ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంటే, హైదరాబాద్ లో బలంగా ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ న్ని వచ్చి తమతో కలవమని కోరడం ఆత్మవిశ్వాసం లోపించినట్లు స్పష్టం చేస్తోంది.
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉన్నట్లు పైకి కనబడుతున్నా దాని బలం కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యుందనే విషయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాయే స్వయంగా బయటపెట్టారు. ఒకవేళ హైదరాబాద్ లో కూడా బీజేపీ తన సత్తా చాటుకోలేకపోయినట్లయితే ఇక తెలంగాణా రాష్ట్రంలో బీజేపీని ఎవరూ రక్షించలేరని చెప్పకతప్పదు. తెరాస పటిస్తున్న ఆకర్ష మంత్రంతో హైదరాబాద్ లో తెదేపా కూడా దాదాపు ఖాళీ అయిపోయింది. అయినా కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీని కాపాడుకోవడం కంటే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున తెదేపా నేతలు కూడా చాలా డీలాపడిపోయున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఆ రెండు పార్టీలను ఒడ్డునపడేయగలడని వారు భావిస్తే తప్పు కాదు. హే! గోపాలా ఇక నువ్వే చక్రం తిప్పాలేమో?