పౌరసత్వ సవరణ చట్టం మీద దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చనీయం చేస్తూ, భాజపాని కార్నర్ చేసేందుకు ఇతర పార్టీలు సిద్ధమౌతున్నాయి. అయితే, త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో… ఈ అంశంపై టి. భాజపా నేతలు ఎట్టకేలకు స్పందించారు. సీఏఏ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమౌతున్నారు. దీనిపై లేనిపోని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయనీ, వాటిని నివృత్తి చేసేందుకు కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి మాట్లాడుతూ… దేశంలోకి ఎవరైనా రావొచ్చనీ వెళ్లొచ్చనీ కొంతమంది అభిప్రాయపడుతున్నానీ, అది సరైంది కాదన్నారు. భారతదేశం అనేకమందికి ఆశ్రయం ఇచ్చిందన్నారు. టిబెట్ లో బౌద్ధ గురువు దలైలామాను మనం గుండెల్లో పెట్టుకుని, అన్ని రకాలుగా మనదేశంలో ఆయన్ని గౌరవిస్తున్నామన్నారు. కానీ, దురదృష్టం ఏంటంటే… కోట్ల మంది అక్రమ చొరబాటుదారులు దేశంలోకి వస్తున్నారనీ, ఇక్కడే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉందన్నారు. ఇతర దేశాల్లో వివక్షకు గురౌతున్నవారికి మనం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మనదేశానికి సరిహద్దులుండాలి, పౌరులకి గుర్తింపు ఉండాలన్నారు.
సీఏఏపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లాలన్న ఉద్దేశంతో ముందుగా నేతలకు అవగాహన కల్పించే పనిని ఇప్పటికే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ పూర్తి చేశారు. ఈనెల 30 హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సీఏఏ అనుకూల ర్యాలీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. జనవరి 2 నుంచి రెండ్రోజులపాటు జిల్లాలవారీగా వర్క్ షాపులు ఉంటాయి. 5 నుంచి మూడు రోజులపాటు విద్యావేత్తలు, మేథావులతో మున్సిపాలిటీల్లో ర్యాలీలు ఉంటాయి. 8 నుంచి 13 వరకూ గ్రామాల్లో ఇంటింటికీ భాజపా నాయకులు వెళ్తారు, సీఏఏ గురించి ప్రజలకు వివరిస్తారు. ఇక, ఇదే సమయంలో సీఏఏ సంఘీభావ ముగ్గుల పోటీలను కూడా నిర్వహించాలని భాజపా నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇకపై భాజపా నేతలు దీన్నొక పెద్ద ప్రచారాస్త్రంగా దశలవారీగా ప్రచారం చేయబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో దీన్నొక పాజిటివ్ అంశంగా మార్చుకోవాలని బాగానే ప్రయత్నిస్తున్నారు!