వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో భాజపా బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్నది అమిత్ షా లక్ష్యం. స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలంటూ అధిష్టానం కోరుకుంటోంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. కొంతమంది ముఖ్య నేతలు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఎవరికివారు పార్టీలో తమ పట్టును ప్రదర్శించుకునేందుకు, ఆధిపత్యాన్ని చాటి చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తాజా ఘటనలు చెబుతున్నాయి. ఇంతకీ, ఈ అధిపత్య పోరు మొదలైంది ఎవరి మధ్యన అంటే… కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల మధ్య అంటూ రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచీ వీరి మధ్య లుకలుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డితో అభిప్రాయ భేదాలు రోజురోజుకీ పెరుగుతున్నట్టు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఈ మధ్య జిల్లాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. అక్కడ తన కమాండ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోపక్క.. కిషన్ రెడ్డి కూడా సింగరేణి ప్రాంతంలో పర్యటన చేసి, తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పార్టీ నాయకులు ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారో అనేది ముందుగా తనకు తెలియాంటూ లక్ష్మణ్ అన్నారట! ఎవరికివారు సొంత అజెండాలతో పర్యటనలు చేసుకుంటే ఎలా అని కిషన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఈ మధ్యనే, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైన సందర్భంగా కూడా వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయట! పర్యటన రద్దయిన వెంటనే రాష్ట్ర నేత సమావేశం ఏర్పాటు చేస్తే.. దానికి కిషన్ రెడ్డి హాజరు కాలేదు. అలాగే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా వీరి మధ్య లుకలుకలు బయటపడ్డాయనీ అంటున్నారు. ఆ కార్యక్రమానికి కిషన్ ను ఆహ్వానించినా, ఆయన కోసం కాసేపైనా వేచి చూడకుండా వేడుకలను లక్ష్మణ్ నిర్వహించేశారట. దాంతో అసంతృప్తికి గురైన కిషన్ రెడ్డి, మరో కార్యక్రమానికి వెళ్లిపోయారట.
ఇలా ఈ ఇద్దరి మధ్యా వివిధ సందర్భాల్లో ఆధిపత్య పోరు బయటపడుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోందట. దీంతో తెలంగాణ భాజపా రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఈ తరుణంలో ఆధిపత్య పోరు తెరమీదికి రావడం సరైంది కాదంటూ ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయమై పార్టీ అధిష్ఠానం స్పందించాలనీ, చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. మరి, ఈ నేతల మధ్య ఆధిపత్య పోరుకు అమిత్ షా ఏవిధంగా చెక్ పెడతారో వేచిచూడాలి.