రాబోయే రోజుల్లో బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించిన కిషన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాటల్ని వినిపించుకునేవారే లేరు. ఇప్పుడు ఎవరైనా బీజేపీలో చేరుతారంటే ఎవరూ నమ్మడం లేదు.కానీ ఎవరైనా బీజేపీ నుంచి వెళ్తారంటే మాత్రం.. అందరూ నమ్ముతున్నారు. ఏదో విధంగా సీనియర్ నేతలు బయటు పోకుండా ఆపుకుంటున్నప్పటికీ. .. కొత్తగా చేరేవారు లేరు. బీఆర్ఎస్ హైకమాండ్ పెద్ద ఎత్తున టిక్కెట్లు నిరాకరిస్తుందని వారంతా తమ పార్టీలోకి వెల్లువలా వస్తారనుకుని బీజేపీ గేట్లు తీసుకుని కూర్చుని ఎదురు చూసింది.
చివరికి ఒక్కరంటే ఒక్కరు చేరలేదు. అసంతృప్తికి గురైన వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికంత మంది గప్ చుప్ గా కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారు. కానీ బీజే్పీతో మాత్రం మాట్లాడటం లేదు. ఇరవై రెండు మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారని హడావుడి చేసిన ఈటల రాజేందర్.. చివరికి అమిత్ షా బహిరంగసభలో కండువా కప్పడానికి ఓ మాదిరి నేతను కూడా ఒప్పించలేకపోయారు. దీంతో బీజేపీ పరిస్థితి తేలిపోయింది.
ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కానీ బీజేపీలో మాత్రం అభ్యర్థులపై ఇంకా కతసరత్తు జరుగుతూనే ఉంది. బలమైన నేతలు కనిపించడం లేదు. గట్టిగా పదిహేను నియోజకవర్గాలకు మాత్రమే ప్రముఖ నేతలు ఉన్నారు. అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశమే లేదని.. కళ్ల ముందు కనిపిస్తున్నా.. కిషన్ రెడ్డి మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు.