తెలంగాణ బీజేపీ చీఫ్గా బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి చాలా మంది తెలంగాణ నేతలు వచ్చారు .. అయితే ఏపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మామూలుగా అయితే పెద్దగా పట్టించుకునేవారు కానీ.. కిరణ్ కమార్ రెడ్డి సమైక్యాంధ్ర సమర్థకుడు.. ఆ డిమాండ్ తో సొంత పార్టీ కూడా పెట్టుకున్న వారు. ఆయనను తెలంగాణ బీజేపీ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం పైగా.. ప్రసంగించడం కూడా చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
ఆయన కూడా తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపేనీ, కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతులో ఉందంటూ చెప్పుకొచ్చారు.
ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రత్యేకంగా తీసుకుంటుంది. తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకుని మళ్లీ తెలంగాణకు తీసుకు వస్తున్నారని ఆరోపణలు చేస్తారు. ఎలా చూసినా కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ లో కిరణ్ రెడ్డి కనిపించడం కాస్త ఆడ్ గానే ఉంది. కార్యక్రమం ముగియక ముందే సోషల్ మీడియాలో విజయశాంతి పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను పిలిచారన్నారు. మొత్తంగా కిరణ్ ను పిలవడం.. బీజేపీలో కొత్త రచ్చకు కారణం అయ్యేలా ఉంది.