కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు తక్షణం సీబీఐకి సిఫార్సు చేస్తూ లేఖ రాయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన వారానికోసారి ప్రెస్ మీట్ పెట్టి ఇదే అడుగుతున్నారు. గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎంత మంది ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మెల్లగా కాళేశ్వరం కథలన్నింటినీ బయటకు తీస్తూంటే… మధ్యలో కిషన్ రెడ్డి సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా లేఖ రాస్తే అలా విచారణ చేయించేస్తామని అంటున్నారు. ఇవ్వకపోతే బీఆర్ఎస్ తో కుమ్మక్కయినట్లేనని కూడా అంటున్నారు.
కిషన్ రెడ్డి తీరు చూసి కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేస్తే కిషన్ రెడ్డికి ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా ఉందని.. సెటైర్లు వేసుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను గుప్పిట్లో పెట్టుకుని.. బీఆర్ఎస్ తో రాజకీయం చేసిన బీజేపీ.. ఇప్పుడు కాళేశ్వరం ను కూడా తమ చేతుల్లోకి తెచ్చుకుని సీబీఐతో గేమ్ ఆడాలని అనుకోవడమో.. లేకపోతే.. ప్రాజెక్టులో అవినీతి బయటకు రాకుండా చేయాలని అనుకోవడమో చేస్తోందని అనుమానిస్తున్నారు. సీబీఐకి అనుమతి లేదని కిషన్ రెడ్డి చెప్పే డొల్ల కబుర్లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పని చేయవని అంటున్నారు.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి గట్టిగా నెల రోజులు కూడా కాకుండానే.. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ హడావుడి చేస్తున్నాయి. వారు ఇప్పుడు మాట్లాడుతున్న అంశాలపై ఏళ్ల తరబడి సైలైంట్ గా ఉన్నారు. రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. కవిత హిందూత్వ వాదం వినిపిస్తూండటం.. వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు లోపాయికారీ అవగాహనతో పోటీ చేసే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతూండటంతో కిషన్ రెడ్డి హడావుడి మరింత హైలెట్ అవుతోంది.