”జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం”
– కిష్కిందకాండం సినిమాలో చివరిగా వినిపించే డైలాగ్ ఇది. ఈ సినిమా తాలూకూ ఆత్మ, శరీరం, జీవ నాడులన్నీ ఈ డైలాగ్‌లోనే ఉన్నాయ్. చాలామంది సినీ మేధావులు, సినీ అభిమానులు ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకొంటున్నారు. ఈ యేడాది మలయాళం నుంచి వచ్చిన మేటి చిత్రాల్లో ఈ సినిమా కూడా ఉంటుందని డిక్లేర్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్లలో ఏమాత్రం అతిశయం లేదన్న సంగతి ఈ సినిమా చూశాకే అర్థం అవుతుంది.
కథలూ, పాత్రలూ, వాటి తాలూకూ విశ్లేషణల జోలికి వెళ్లడం లేదు. కానీ.. ఓ విషయం మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. కాగితం పై రాసుకొంటే తేలిపోతుందేమో అనుకొన్న ఓ చిన్న పాయింట్ ని రెండు గంటల పాటు సినిమాగా తీసి మెప్పించగలనన్న దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సినిమా అంతా అయిపోయాక.. రచయితకు ఈ పాయింట్ ఎలా తట్టి ఉంటుందబ్బా? అని కాసేపు ఆశ్చర్యపోయిన తరవాతే.. ఈ సినిమా మెచ్చుకోవడం మొదలెడతాం.
అప్పు పిళ్లై పాత్ర, దాన్ని తీర్చిదిద్దిన తీరు… ప్రేక్షకుడ్ని విస్మయానికి గురి చేస్తుంది. ఈమధ్య కాలంలో చూసిన గొప్ప పాత్రల్లో ఇదొకటి. అసలు కిటుకంతా ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. తనకు మతిమరుపు ఉన్న విషయాన్ని కప్పి పుచ్చడానికి అప్పు పిళ్లై చేసే పనులు, తీసుకొనే జాగ్రత్తలూ ఆశ్చర్యపరుస్తాయి. తనకు మతిమరుపు ఉన్న సంగతి అప్పు పిళ్లైనే ఒప్పుకోడు. అందుకు తన ఈగో ఒప్పుకోదు. కొడుకు పాత్ర కూడా అంతే గొప్పగా రాసుకొన్నాడు రచయిత. తండ్రి ఈగోని కాపాడడానికి కొడుకు పడే తాపత్రయం చూస్తే – ఇలాంటి కొడుకు ప్రతీ తండ్రికీ ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. తెరపై కనిపించే పాత్రలు కొన్నే. కానీ ప్రతీ పాత్రకూ ఓ పర్పస్ అంటూ ఉంది. ఆఖరికి కోతికి కూడా. రచయిత రాసిన ప్రతీ మాటకూ ఈ కథలో స్థానం ఉంది. కొన్నిసార్లు మౌనం, నిశ్శబ్దం కూడా చాలా మాటలు చెబుతుంటాయి. పోయిన గన్నూ – కొమ్మలపై కుప్పిగంతులు వేసే కోతులు – తప్పిపోయిన కొడుకూ – నక్సలైట్లూ – వీటన్నింటినీ ముడి పెడుతూ అప్పు పిళ్లై మతిమరుపూ… ఓ కథని ఇలా రాయొచ్చు, ఇలా తీయొచ్చు.. ఇలా ఒప్పించొచ్చు అని చెప్పడానికి, రచయితల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించడానికి ఇదో గైడ్.
అలాగని సినిమా జెట్ స్పీడులో ఏం ప్రయాణం చేయదు. నెమ్మదిగా మొదలై, చివరికి స్లో పాయిజన్‌లా మారిపోయి, మనల్ని కేరళ అడవుల్లోకి, అప్పు పిళ్లై అనే మాజీ మిలటరీ అధికారి ముందుకూ తీసుకెళ్లిపోతుంది. థ్రిల్లర్ సినిమానే కానీ, పెద్ద పెద్ద ట్విస్టులు ఉండవు. కానీ సినిమా అంతా అయిపోయాక ఓ చిక్కటి, చక్కని అనుభూతి కలుగుతుంది. హాట్ స్టార్‌లో ఉన్న ఈ సినిమా సినీ అభిమానులు ఎట్టిపరిస్థిలుల్లోనూ మిస్ అవ్వకండి.