సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల తరువాత మళ్ళీ కనిపించలేదు. ఆ మధ్య ఎప్పుడో ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చినా ఇంతరవరకు అయన ఏ పార్టీలోను చేరలేదు. కానీ ఒక ఆశ్చర్యకరమయిన వార్త ఒకటి ఈరోజు వెలువడింది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెర వెనుక నుండి చక్రం తిప్పిన ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఇంకా ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారుట! కానీ అతనిని తెదేపాలో ఎందుకు చేర్చుకొంటున్నారో…పార్టీతో అసలు సంబంధం లేని అతనికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనుకొంటున్నారనే దానిపై సమర్ధనీయమయిన వివరణ లేదు. వచ్చే నెలాఖరులోగా ఆయన తెదేపాలో చేరవచ్చని మాత్రం సమాచారం.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించారనే చెప్పవచ్చును. ఆయన ఎన్నడూ ఏ ప్రత్యర్ధ పార్టీల ఒత్తిళ్ళకి తలొగ్గలేదు. చివరికి రాష్ట్ర విభజన విషయంలో తన పార్టీ అధిష్టానాన్ని కూడా బహిరంగంగా ధిక్కరించారు. ముఖ్యమంత్రిగా చివరి నిమిషం వరకు అంతా తనకు నచ్చినట్లే నడిపించుకొన్నారు. కానీ అక్కడి నుండి ఆయన రాజకీయ పతనం మొదలయింది. ఎన్నికలలో ఘోర పరాజయంతో ఆయన రాష్ట్ర రాజకీయాల నుండి తప్పుకొన్నారు. కానీ ఏదో ఒకనాడు మళ్ళీ ఆయన రాజకీయాలలోకి వస్తారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయనకి బదులుగా ప్రజలకు బొత్తిగా పరిచయం లేని ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటం, అది కూడా తమ రాజకీయ ప్రత్యర్ది పార్టీ అయిన తెదేపాలో చేరబోతుండటం ఏదీ కూడా నమ్మశక్యంగా లేవు. కనుక ఈ వార్తని తెదేపా దృవీకరిస్తే తప్ప నమ్మలేని పరిస్థితి. కిషోర్ కుమార్ రెడ్డి నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత ఆయన పేరు వినిపించింది.