తొలి సినిమా ఫ్లాప్ అయితే ఇక అంతే సంగతులు అనుకొంటారు. మరో సినిమా అవకాశం అందిపుచ్చుకోవడం, ఆ సినిమాని హిట్ చేయడం తలకు మించిన పని. అయితే ఈ విషయంలో కిషోర్తిరుమల మాత్రం సక్సెస్ అయ్యాడు. తన తొలి సినిమా ‘సెకండ్ హ్యాండ్’.. పూర్తిగా హ్యండ్ ఇచ్చేసినా, అధైర్య పడలేదు. రామ్ కి ఓ కథ చెప్పి ఒప్పించాడు. ‘నేను శైలజ’తో హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’లోనూ రిపీట్ అవుతోంది. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కిషోర్ తిరుమలతో చిట్ చాట్.
* ఉన్నది ఒకటే జిందగీ… జిందగీ నా మిలేగ దుబారా.. టైటిళ్లతోనేనా, సినిమాలకూ పోలిక ఉందా?
– జిందగీ అన్న పదం తప్ప… ఆ సినిమాకీ ఈ సినిమాకీ ఎలాంటి పోలిక లేదు.
* ప్రేమ, జీవితం, స్నేహం.. వీటిలో ఏది చూపిస్తున్నారు?
– ప్రేమ, స్నేహం.. ఇదే కదా జీవితం. కాబట్టి ఇవి మూడూ ఈ సినిమాలో ఉంటాయి.
* ఫ్రెండ్ షిప్‌పై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి.. మరి ఈ కథలో కొత్తదనం ఏంటి?
– ఈమధ్యకాలంలో ఫ్రెండ్ షిప్ బేస్డ్ సినిమాలు రాలేదు. వచ్చినా అందులో డ్రామా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు అన్నీ సహజంగా ఉంటాయి. మనకో మిత్రుడు ఉంటే ఎలా ఉంటుందో రామ్ పాత్ర అలా ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య మాటలు, వాళ్ల పై తెరకెక్కించిన సన్నివేశాలు చాలా సరదాగా, నిజ జీవితంలో జరుగుతున్నట్టే ఉంటాయి. ఈ సినిమాలో అందరూ మంచోళ్లే. పాజిటీవ్ గానే ఆలోచిస్తారు. విలన్ అనేవాడే లేడు. కథలో సంఘర్షణలే ప్రతి నాయక పాత్ర పోషిస్తాయి.
* రామ్ లుక్ కొత్తగా అనిపిస్తోంది..
– ఆ క్రెడిట్ పూర్తిగా రామ్ కే దక్కుతుంది. ఓ గెటప్‌లో గెడ్డం పెంచి స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఆ వయసు కుర్రాళ్ల ఆలోచనలు, వాళ్ల వేషధారణ ఓ రకంగా ఉంటాయి. దాన్ని బట్టే ఆ లుక్ ప్రయత్నించాం.
* రామ్ పాత్ర ఎలా ఉంటుంది?
– స్నేహానికి ఎక్కువ ప్రాణం ఇస్తాడు. ప్రతీదీ సింపుల్‌గా తీసుకొంటున్నాడనిపిస్తుంది. కానీ ఆ సింపుల్‌గా తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణం ఉంటుంది. తన క్యారెక్టరైజేషనే ఈ కథకు మూలం. ఈ పాత్రలో రామ్ చక్కగా ఒదిగిపోయాడు. రామ్ ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తాడు. ఈ సినిమాతో అది మరోసారి రుజువైంది.
* ఉన్నది ఒకటే జిందగీ ప్రచార చిత్రం చూస్తుంటే – నేను శైలజకి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది.?
– అదేం కాదండీ. రెండూ వేర్వేరు కథలు. వైజాగ్ బ్యాక్ డ్రాప్, రామ్ హీరో అవ్వడం వల్ల అలా అనిపిస్తోందేమో.
* వాటమ్మా.. పాట సురేష్‌బాబుగారి మేనరిజాన్ని తీసుకొని డిజైన్ చేశారా?
– అలాఏం లేదండీ. నేను శైలజ తరవాత వెంకటేష్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయనకు ఎలాంటి పాటలైతే బాగుంటుందనుకొంటూ కొన్ని కాన్సెప్టులు డిజైన్ చేసుకొన్నాం. అందులో ఇదొకటి. దాన్ని ఇక్కడ వాడుకొన్నాం అన్నమాట. ఈ పాట వెంకటేష్‌గారు విన్నార్ట. `అదిరిపోయింది` అంటూ ఫోన్ చేసి అభినందించారు.
* వెంకటేష్‌తో ఓ సినిమా అనుకొన్నారుగా.. ఎందుకు ఆగిపోయింది?
– ఆ సినిమా ఏం ఆగిపోలేదు. కథ పూర్తిగా సిద్దం కాలేదు. పూర్తి కథ సిద్దం చేసి, ఆయనకు మళ్లీ వినిపిస్తా.
* నేను శైలజ హిట్ మీలో పెంచిన నమ్మకం ఎలాంటిది?
– నా తొలి సినిమా సరిగా ఆడలేదు. ఆ సమయంలో వచ్చిన సినిమా ఇది. హిట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరులా ఉంటుంది. అయితే దాన్ని చూసి మురిసిపోకూడదు. ప్రతీ సినిమా నాకు తొలి సినిమానే. సినిమా సినిమాకీ కష్టపడుతూనే ఉండాలి. నిరూపించుకొంటూనే ఉండాలి. ఓ కథ పూర్తి చేసుకొని, తెరకెక్కించి, రీ రికార్డింగ్‌లో చూసుకొని, ఫైనల్ కాపీ ఓకే అనేంత వరకూ టెన్షన్ పడుతూనే ఉండాలి. ప్రతీ సినిమాకీ జాగ్రత్తగా అడుగులేయాలి. రిలాక్స్ అనేది లేనట్టే.
* తదుపరి సినిమాలేంటి?
– ప్రస్తుతం ఉన్నది ఒకటే జిందగీ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆ తరవాతే.. కొత్త సినిమా గురించి ఆలోచిస్తా.