ఉయ్యాల జంపాలతో హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. అక్కడ్నుంచి మనోడి ప్రయాణం ఎక్స్‌ప్రెస్ బండి కంటే వేగంగా సాగిపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. అతని పారితోషికం కూడా సినిమా సినిమాకీ పెరుగుతూనే ఉంది. దర్శకుడు అవ్వాలని ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టిన రాజ్ తరుణ్.. అనుకోకుండా నటుడయ్యాడు. ఇప్పుడు గీత రచయిత గా కూడా మారిపోయాడు. రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా కోసం జానీ జానీ ఎస్ పప్పా.. అనే పాట రాశాడు. అమ్మాయిలపై ద్వేషంతో ఓ అబ్బాయి పాడుకొనే `మందు` పాట ఇది. కాకపోతే.. రాజ్‌తరుణ్ ఆషామాషీగా ఏం రాయలేదు. ఓ పాపులర్ గీత రచయిత స్టామినా.. ఈ పాటలో కనిపించింది.. వినిపించింది. సీరియస్‌గా ట్రై చేస్తే.. రాజ్ తరుణ్ గీత రచయితగానూ పెన్ను తిప్పొచ్చు. పాటంతా విన్న తరవాత రాజ్‌తరుణ్‌లో ఇంత టాలెంట్ ఉందా.. అనిపించకమానదు. అనూప్ రూబెన్స్ బాణీ సోసోగా… తన గత సినిమాల పాటల్ని గుర్తు తెచ్చేలా ఉంది. అదొక్కటే మైనస్. దొంగాటతో ఆకట్టుకొన్న వంశీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనూ ఇమ్మానియేల్ కథానాయికగా నటించింది. ట్రైలర్లో చూపించిన లిక్ లాక్ సీన్ ఇప్పటికే కుర్రకారులో హీట్ పెంచేసింది. థియేటర్లో ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి.