తెలుగు సినిమావాళ్ళకు కొత్త పాయింట్లు బాగానే దొరుకుతూ ఉంటాయి. వేరే సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యో, లేక కాపీ కొట్టో, లేకపోతే సొంత తెలివితేటలతోనో కొత్త పాయింట్లు మాత్రం బాగానే పట్టేస్తూ ఉంటారు. కానీ కొత్తగా ఉండే ఆ పాయింట్ చుట్టూ అంతే కొత్త కథనాన్ని కూడా తెరకెక్కించాలంటే మాత్రం ధైర్యం సరిపోదు. మాంచి ఫాంలో ఉన్న కమెడియన్ పృథ్వీ కామెడీ, ఐటెం సాంగ్, హీరోయిన్ని టీజ్ చేస్తూ…ఏడిపిస్తూ…ఆ అమ్మాయిని ఎలా అయినా లవ్‌లో పడేసే హీరో లవ్ ట్రాక్….ఇలాంటి రొటీన్ మసాలాలన్నీ ఉండాల్సిందే. వీటికి తోడు పంచ్ డైలాగుల వ్యవహారం ఒకటి. ఓ కొత్త పాయింట్‌కి ఇన్ని రొటీన్ మసాలాలు మిక్స్ చేసేసరికి చాలా సార్లు…..ఆ కొత్త పాయింట్ కూడా రొటీన్ పులిసిపోయిన పులిహోరే అయిపోతోంది. తాజాగా రిలీజ్ అయిన రాజ్ తరుణ్ సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఈ కిట్టూగాడిది కూడా రొటీన్ వ్యవహారమే అన్న అనుమానం వస్తోంది.
అప్ కమింగ్ రైటర్ అయిన శ్రీకాంత్ అనే కుర్రాడు కుక్కల కిడ్నాప్ వ్యవహారం చుట్టూ కాస్త కొత్త పాయింటే అల్లుకున్నాడు. ఆ పాయింట్‌ని పక్కనపెడితే ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ ట్రైలర్ మొత్తం కూడా పాత వాసనే కొడుతోంది. అది కూడా అన్ని రకాల ఓల్డ్ మసాలాలు అన్నీ ఉన్నాయని చెప్పడానికి తాపత్రయపడ్డారు. రొటీన్ పృథ్వీ కామెడీ, హంసా నందిని ఐటెం సాంగ్‌లతో పాటు రొటీన్ మసాలాలన్నీ చూపించారు. ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాల స్టైల్లోనే ఉంది. కుక్కల కిడ్నాప్ వ్యవహారం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త టైటిల్ వరకూ చూసుకుంటే మాత్రం కొత్త తరహా సినిమాలను, కాస్త కొత్త కథలను ఇష్టపడే ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా ఉంది. సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం …మా సినిమాలో కొత్తగా ఏమీ లేదు…..తెలుగు సినిమా ట్రేడ్ మార్క్ పాత మసాలాలనే చూపించబోతున్నాం అని మేకర్సే ప్రేక్షకులకు చెప్పినట్టుగా ఉంది. సాయి మాధవ్ బుర్రా రాసిన పంచ్ డైలాగులు కూడా పెద్దగా పేలలేదు. ఈ ట్రైలర్లో ఉన్న తరహా కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వడం మానేసి రెండేళ్ళపైనే అవుతోంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.