కేకే సర్వేస్ ప్రిడిక్షన్ మరోసారి తప్పు అయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దాదాపుగా 90 శాతం వరకూ యాక్యూరసీతో అంచనాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు కేకే సర్వే కిరణ్ కొండేటి. కేకే సర్వేస్ పేరుతో ఆయనకు యూట్యూబ్ చానల్ మాత్రమే ఉందా.. నెట్ వర్క్ ఉందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఆయనలెక్కలు మాత్రం కరెక్ట్ అయ్యాయి. ఆరా మస్తాన్ తనదో పెద్ద స్ట్రాటిజిక్ కంపెనీ అని హడావుడిచేస్తారు కానీ ఆయన కనీసం వాస్తవానికి దగ్గరగా కూడా చెప్పలేకపోయారు. అందుకే కేకే సర్వేస్పై మంచి నమ్మకం ఏర్పడింది. అయితే ఇతర రాష్ట్రాల ప్రిడిక్షన్స్తో కేకే సర్వేస్ తన విశ్వసనీయత కోల్పోతోంది.
ఇటీవల హర్యానా ఎన్నికల్లో కేకే సర్వేస్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా స్వీప్ చేస్తుందని ప్రకటించింది. హర్యానా ఓటర్లు, అక్కడి పరిస్థితుల గురించి ఎంత అధ్యయనం చేశారో తెలియదు కానీ కిరణ్ కొండేటి మాత్రం కాంగ్రెస్కు 75, బీజేపీకి 11 సీట్లు మాత్రమే అంచనా వేశారు. కానీ అసలు ఫలితాలు మాత్రం బీజేపీకి 48, కాంగ్రెస్కు 37 గా తేలాయి. దీంతో వంద శాతం కేకే సర్వేస్ ఫెయిలయింది.
తాజాగా ఢిల్లీ ఎన్నికలలోనూ అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని అంచనా వేయగా కేకే సర్వేస్ కిరణ్ కొండేటి మాత్రం ఆప్ భారీ విజాయన్ని సాధించబోతున్నట్లుగా అంచనావేశారు. కనీసం 48 సీట్లు గెలుస్తుందని తేల్చారు. బీజేపీ 21 నుంచి 24 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. కానీ అసలు రిజల్ట్స్ రివర్స్ అయ్యాయి. బీజేపీకి 48 సీట్ల వరకూ వచ్చాయి. ఆప్ 22కే పరిమితం అవుతోంది.
అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వేస్ ప్రకటించిన ఫలితాలు వాస్తవానికి కాస్త దగ్గరగా ఉన్నాయి. అంటే.. కిరణ్ కొండేటి .. తనకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ లేకుండా తన ఎనలిటిక్ స్కిల్స్ తోనే ఫలితాలు ప్రకటిస్తున్నారన్న అభిప్రాయానికి రావొచ్చు. ఎన్నికల ఫలితాలు ఎవరైనా అంచనా వేయవచ్చు. మంచి వేటగాడు అయినా అన్ని సార్లు గురి చూసి గాల్లోకి కొట్టి లక్ష్యాన్ని అందుకోలేడు. అలాగే కేకే సర్వేస్ కూడా. కిరణ్ కొండేటి మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కావొచ్చు కానీ దాంతోనే సర్వేలు ప్రకటిస్తే ఇలాంటి ప్రకటిస్తే లాటరీలాగానే మారే చాన్స్ ఉంది.