టీమిండియాలో కేఎల్ రాహుల్ స్థానం చాలా వింతగా వుంటుంది. కీపర్ కమ్ బ్యాటర్ గా సెలెక్ట్ చేస్తారు. టెస్ట్ లో ఓపెనింగ్ పంపిస్తారు. కొన్నిసార్లు ఫస్ట్ డౌన్, కొన్నిసార్లు సెకండ్ డౌన్. వన్డేలో సెకండ్ డౌన్, థర్డ్ డౌన్. ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీలో అయితే ఏకంగా ఆరో వికెట్ గా పంపిస్తున్నారు. కానీ ఏ స్థానంలో వచ్చినా తన క్లాస్ చూపించే ఆటగాడు రాహుల్. నిన్న ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో కూడా కీలక ఇన్నింగ్ ఆడాడు.
అక్సర్ పటేల్ అవుట్ తర్వాత క్రేజ్ లోకి వచ్చాడు రాహుల్. ఎక్కువ డాట్ బాల్స్ ఆడేస్తాడని అతనిపై ఓ అపవాదు వుంది. నిన్న తను వచ్చిన కండీషన్ కూడా అలాంటిదే. అయితే అప్పటికే క్రేజ్ లో కుదురుకున్న విరాట్ కి అద్భుతమైన సహకారం అందించాడు రాహుల్. నిలకడగా సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఒకదశలో విరాట్ ని రిలాక్స్ అవ్వమని హిట్టింగ్ బాధ్యత తను తీసుకున్నాడు. తన వికెట్ పోయినా చివరి వరకూ విరాట్ వుండాలనేది గేమ్ ప్లాన్.
రాహుల్ సపోర్ట్ తో విరాట్ ఈజీగా సెంచరీ చేయాల్సింది. అదే ఓవర్ లో రాహుల్ ఓ సిక్స్ బాదాడు. వెంటనే ఒక అనవసరమైన షాట్ ఆడి బంతిని గాల్లోకి లేపాడు విరాట్. ఈ అవుట్ విరాట్ కంటే రాహుల్ ని ఎక్కువ బాధించింది. విరాట్ ని చూసి ”నేను కొట్టేవాడిని కదా’అని మైదానంలోనే నిటూర్చాడు రాహుల్.
చిన్న అవకాశం వచ్చిన మ్యాచ్ పై పట్టుసాధించే ఆసీస్ కి విరాట్ అవుట్ తో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తర్వాత వచ్చిన హార్దిక్ కూడా త్వరగా పరుగులు రాబట్టి అవుట్ అయ్యాడు. అయితే రాహుల్ మాత్రం తనవైపు నుంచి ఎలాంటి తప్పు జరగకుండా చుసుకున్నాడు. ఎక్కడా బెదురు లేకుండా నిలబడ్డాడు. సిక్స్ తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ చేసిన 42 పరుగులు ఒక సెంచరీ కంటే తక్కువేమీ కాదు. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ నేరుగా వెళ్లి రాహుల్ ని హాగ్ చేసుకున్నాడు. ఆ సెలబ్రేషన్ తో రాహుల్ ఇన్నింగ్ ప్రాముఖ్యత అర్ధం చేసుకోవచ్చు. రాహుల్ లాంటి క్లాస్ ప్లేయర్ ఆరో స్థానంలో ఇంత చక్కని ఫామ్ లో ఆడటం ఇండియా బ్యాటింగ్ బలాన్ని మరోసారి ప్రపంచ క్రికెట్ కి చాటి చెప్పింది.