రియల్ ఎస్టేట్ రంగం అంటే మోసాల పుట్ట. ఎన్నోరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. అందులో అసలు ఇల్లు ఇవ్వకుండా ఎగగొట్టడం దగ్గర నుంచి ఒప్పందం ప్రకారం కట్టివ్వకుండా మోసం చేయడం వరకూ చాలా ఉంటాయి. అందుకే వినియోగదారులు ప్రతి విషయంలోనూ ఎంతో క్లారిటీగా ఉండాలి. చాలా మంది అన్ని విషయాలోనూ ఆసక్తి చూపిస్తున్నారు కానీ క్యాన్సిలేషన్ క్లాజుల్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇదే వారికి తలనొప్పిగా మారుతోంది.
ఇప్పుడు ముందస్తు బుకింగ్ లు పెరిగిపోయాయి. సినిమా టిక్కెట్ల నుంచి ఇళ్ల వరకూ అవే బుకింగులు ఉంటున్నాయి. ప్రతీ చోటా క్యాన్సిలేషన్ పాలసీ ఉంటోంది. క్యాన్సిల్ చేసుకుంటే కొంతే ఇస్తామని టిక్కెట్ బుకింగ్ యాప్‌లలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ క్యాన్సిలేషన్ పాలసీ విషయంలో గోప్యత పాటిస్తున్నాయి. ఎక్కువ సమాచారం కొనుగోలుదారులకు చేరనీయడం లేదు. ఇల్లు బుకింగ్ చేసుకున్న తర్వాత ఏ కారణం తో అయినా క్యాన్సిల్ చేసుకుంటే నష్టపోకుండా ఉండేలా నిబంధలను కొనుగోలుదారుడు రాయించుకోవాలి.
ఓ వస్తువు కొనుగోలుకు ఆర్డర్ పెట్టిన తర్వాత అంత కంటే మంచిది తక్కువ రేటుకు రావడం.. ఎక్కువ పెట్టామని అనిపించడం లేకపోతే తొందరపడి డబ్బులు కట్టేశామని అంత భరించలేమని అనుకోవడం వంటివి జరుగుతాయి. అదే సమయంలో బిల్డర్లు స్లోగా నిర్మించడం, ఎప్పటికి పూర్తి చేస్తారో కూడా తెలియకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయాల్లో క్యాన్సిల్ చేసుకుంటే తమ డబ్బులు తమకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది.
ఇలాంటి సమయంలో క్యాన్సిలేషన్ చార్జీలు వేస్తామని బిల్డర్లు అంటారు. బిల్డర్ తప్పు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు కొనుగోలుదారులకు పడటం సమస్యే. అందకే అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుని సంతకాలు చేసుకుంటే… మంచిది. ముఖ్యంగా క్యాన్సిలేషన్ పాలసీ విషయంలోనూ.