హైదరాబాద్ చాలా కాలంగా ఓ వైపే అభివృద్ధి చెందింది. మరో వైపు ఫామ్ హౌస్లు, పొలాలతో పచ్చగా ఉంది. దీనికి కారణం 111 జీవో. ఈ జీవోలు నిర్దేశించిన ప్రాంతాల్లో పది శాతంలోనే శాశ్వత నిర్మాణాలు ఉండాలి. అందుకే అటు వైపు రియల్ ఎస్టేట్ అంటే.. ఫామ్ హౌస్లే అన్నట్లుగా ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఆ జీవోలు ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ అది సాధ్యమా.. అధికారికంగా అనుమతులు ఇస్తారా లేదా అన్నదానిపై ఇప్పటికీ క్లారిట ీలేదు.
హైదరాబాద్లోని ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాలు, విశాలమైన గెస్ట్ హౌసుల నిర్మాణం ఊపందుకుంది. వీటికి హెచ్ఎండీఏ, రెరా నుంచి ఎలాంటి అనుమతులు ఉండటం లేదు. పాత తేదీలు వేసి పంచాయతీలు ఇచ్చిన అనుమతిని చూపెట్టి కొందరు అక్రమార్కులు లగ్జరీ విల్లాల్ని కడుతున్నారు. ఈ ట్రిపుల్ వన జీవో ప్రాంతాల్లోని నిర్మాణాలకు అనుమతినిస్తున్నారా? లేదా? అనే విషయంపై హెచ్ఎండీఏ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ట్రిపుల్ వన్ జీవోను తొలగించామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన జీవోను ఎక్కడా విడుదల చేయలేదు. అందుకే అనుమతులు ఇవ్వడం అసాధ్యం.
ఇప్పుడు విస్తృతంగా 111 జీవో ప్రాంతంలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇళ్లు నిర్మిస్తున్నారు. కొనేందుకు కొంతమంది పోటీ పడుతున్నారు. అందుకే అలాంటి చోట్ల ఇళ్లు లేదా అపార్టు్మెంట్లు కొనేముందు ముందుగా చూడాల్సింది అనుమతులే. గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయని … హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకు వస్తామని ఎవరైనా చెబితే గుడ్డిగా నమ్మేస్తే నట్టేట మునిగిపోతారు. కొంత తక్కువకే ఇస్తామని వారు ఆఫర్లు ఇస్తారు. కానీ తర్వాత హెచ్ఎండీఏ కూల్చివేస్తే అసలు గూడు లేకుండా పోతుంది.
హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద విల్లాలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఎవరూ అనుకోరు. అన్ని అనుమతులు ఉన్నాయనుకుంటారు. కానీ పవర్ ఉంది కదా అని చాలా మంది ఆ పని చేస్తున్నారు. 111 జీవో ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయి స్పష్టతనివ్వాల్సిన పరిస్థితి హెచ్ఎండీఏ మీద ఉంది. లేకపోతే ఎక్కువ మంది నష్టపోయే అవకాశం ఉంది.