‘కోబలి’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ‘అత్తారింటికి దారేది’ తరవాత పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో రావాల్సిన సినిమా ఇది. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యింది. కానీ 2014 ఎన్నికల వేడి, జనసేన ఆవిర్భావం తదితర కారణాల వల్ల.. ఈ సినిమాకి సమయం కేటాయించలేకపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా రిసెర్చ్ చేశాడు. రాయలసీమకు చెందిన కవులు, కళాకారులు, ఫ్యాక్షనిస్టులతో మాట్లాడాడు. అయితే అందుకు సంబంధించిన రిసెర్చ్…. ఎన్టీఆర్ సినిమా కోసం బాగా ఉపయోగపడుతోందట. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే టైటిల్ పెట్టారు. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. ‘కోబలి’ కోసం చేసిన రాయలసీమ రీసెర్చ్ ఈ సినిమా కోసం వాడుకుంటున్నాడు త్రివిక్రమ్. యాస. ఊరు పేర్లు, పాత్రల పేర్లు.. ‘కోబలి’ స్క్రిప్టు నుంచే తీసుకుంటున్నాడట. రాయలసీమ నేపథ్యంలో సాగే ప్రతీ సన్నివేశంలోనూ.. ఆ యాస మాత్రమే వినిపించేలా జాగ్రత్త పడ్డాడట. అందుకోసం… భాషకు సంబంధించిన మూలాల్లోకి వెళ్లాడట త్రివిక్రమ్. అందుకే.. ఈ సినిమా సంభాషణల్లో మనకు కొత్త సౌండింగ్ వినిపించబోతోంది.
మరి ‘కోబలి’ ఎప్పుడు? – దీనిపైనా త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చేశాడు. పవన్‌తో కోబలి సినిమా చేయాలని తనకీ ఉందని, 2019 ఎన్నికల తరవాత.. సినిమా చేయడానికి పవన్ రెడీగా ఉంటే.. ‘కోబలి’ పట్టాలెక్కిస్తానని చెప్పుకొచ్చాడు. ‘కోబలి’లో పాటలేం ఉండవట. 1.45 గంటల్లో సినిమా పూర్తవుతుందని త్రివిక్రమ్ చెబుతున్నాడు. ఓరకంగా ఇది ప్రయోగాత్మక చిత్రమే అనుకోవాలి.