హైదరాబాద్: గుడివాడ పట్టణంలో వైసీపీ కార్యాలయం అద్దెకుంటున్న భవనం వివాదంలో అరెస్ట్ అయిన స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ సాయంత్రం జైలునుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుర్కోలేక తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. స్థల వివాదం కోర్టులో ఉందని, వివాదాస్పద భవనంలోనే పార్టీ ఆఫీస్ కొనసాగుతోందని చెప్పారు. అధికారం అండతో ఇబ్బందులు పెట్టాలనుకోవంట సరికాదన్నారు.
మరోవైపు భవన యజమాని సుశీల మీడియాతో మాట్లాడుతూ, పదకొండేళ్ళనుంచి నాని తన ఇంట్లో అద్దెకుంటున్నాడని, రెండేళ్ళనుంచి ఖాళీ చేయమని అడుగుతున్నానని చెప్పారు. ఎన్నికలవగానే ఖాళీ చేస్తానని ఒకసారి చెప్పాడని, తర్వాత అడిగితే ఇల్లు కలిసొచ్చిందన్నాడని తెలిపారు. ఇదిగో, అదిగో అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడని చెప్పారు. తాను ప్రస్తుతం భవనంలో పై అంతస్తులో ఉంటున్నానని, వృద్ధురాలినవ్వటంతో పైకెక్కలేక కింద పోర్షన్లోని వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించి అక్కడకు మారాలనుకుంటున్నట్లు తెలిపారు.