మంత్రి కొడాలి నాని మాటలే కదా అనుకుంటున్నారేమో కానీ.. రాజకీయాల్లో ఉండాల్సిన లిమిట్‌ను క్రాస్ చేసి.. చెలరేగిపోతున్నారు. ప్రత్యర్థులు అయిన రాజకీయ నేతల చావుల గురించి మాట్లాడినంత ఈజీగా.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన ఆలయాల గురించి వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రథాలను… డబ్బుల విలువ లెక్కిస్తున్నారు. అవి తగలబడితే.. దొంగలెత్తుకుపోతే ఏమవుతుందని వితండవాదం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంపైనా అంతే. డిక్లరేషన్ విషయంలో చర్చిలు, మసీదులతో పోల్చేశారు. కొడాలి నాని టంగ్ పవర్ గురించి చాలా రోజుల నుంచి వింటున్నారు కానీ.. ఇప్పుడు ఆ టంగ్ పవర్ … దేవుళ్ల మీదకు రావడమే.. చాలా మందిని షాక్‌కు గురి చేస్తోంది.
హిందూ ఆలయాలపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసి.. వాటి పవిత్రను.. చాలా తేలిగ్గా తీసి పడేసిన కొడాలి నాని.. అదే చర్చిపై రాళ్లేశారంటూ… 41 మందిని అరెస్ట్ చేసి.. పది రోజుల పాటు బెయిల్ కూడా రాకుండా.. జైల్లో ఉంచారన్న విషయాన్ని చెప్పలేదు. అంతర్వేదిలో.. రథం దగ్ధం ఆందోళనలు జరిగినప్పుడు… స్థానికంగా ఉన్న ఓ చర్చిపై కొంత మంది ఆందోళనకారులు రాళ్లేశారు. అద్దాలు పగిలిపోయాయి. రథం దగ్దం అయితే.. దానికి ఇన్సూరెన్స్ ఉంది లైట్ తీసుకోమని సలహా ఇచ్చిన ప్రముఖులు.., హుటాహుటిన చర్చి వద్దకు వెళ్లి పగిలిపోయిన అద్దాలను పరిశీలించారు. రాళ్లేసినవారిని వెంటాడి.. వేటాడి పట్టుకుని జైలుకు తరలించారు.
అలా అరెస్ట్ చేసిన వారిని వదిలి పెట్టాలని.. భారతీయ జనతా పార్టీ నేతలు రాజకీయం చేశారు. చలో అంతర్వేది ర్యాలీలు నిర్వహించారు. కానీ.. ప్రభుత్వం.. వారి రాజకీయం చేసుకున్న తర్వాతనే బెయిల్ ఇచ్చింది. కొడాలి నాని చెప్పిన దాని ప్రకారం చూస్తే… హిందూ ఆలయాలకు సంబంధించిన వస్తువుల విలువ కేవలం డబ్బు మాత్రమే. కానీ చర్చిల కిటికీల అద్దాలు మాత్రం అత్యంత పవిత్రమైనవి. వాటి అద్దాలు పగలగొడితే.. ఎన్నాళ్లు జైల్లో పెడతారో ఊహించడం కష్టం. హిందూ ఆలయాలపై జరిగిన చేసే దాడులను తీసుకున్నంత తేలిగ్గా వాటిని తీసుకోరని అనుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ మత వివక్ష ఏమిటో.. కొడాలి నాని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే.. ఆయన గౌరవనీయమైన మంత్రి. కేవలం వైసీపీకి మంత్రి కాదు. రాష్ట్రానికి సంబంధించి అన్ని బాధ్యతలున్న మంత్రి. పెద్దల దగ్గర తన విధేయతను నిరూపించుకోవడానికి…మత విద్వేషాలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలనుకోవడం మంచి లక్షణం కాదు.