వంగవీటి రాధాకృష్ణ ఆదివారం వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆ ఫంక్షన్ హాల్లో కొడాలి నాని కూడా ఉన్నారు. ఇద్దరూ పాత మిత్రులు కావడంతో మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుకున్నది ప్రత్యేకంగా మీడియాలో వచ్చేలా చేయడంలో కొడాలి నాని వర్గీయులు సక్సెస్ అయ్యారు. దాంతో పాటు వంగవీటిని వైసీపీలోకి ఆహ్వానించారని ..ఎమ్మెల్సీ ఇస్తారని మంచి ప్రాధాన్యం కూడా ఇస్తారన్న ప్రచారం ప్రారంభించారు. అయితే దీని వెనుక కొడాలి నాని వ్యూహం ఉందన్న అభిప్రాయం వంగవటి రాధా వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.
వంగవీటి రాధాకృష్ణ ఇటీవలి కాలంలో గుడివాడపై దృష్టి పెట్టారు. ఆయన తరచూ అక్కడ పర్యటిస్తున్నారు. గుడివాడలో కాపు సామాజికవర్గం కూడా బలంగా ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున దేవినేని అవినాష్ నిలబడినప్పుడు కొడాలి నాని తన ప్రచారం కాపు వర్గాన్ని రెచ్చగొట్టేలా వంగవీటి రంగా హత్యను పదే పదే ప్రస్తావించారు. అది వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు అదే అవినాష్ వైసీపీలో ఉన్నారు. గుడివాడలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. విజయవాడ సిటీలో టీడీపీకి అభ్యర్థులు ఉన్నారు. గుడివాడపై దృష్టి పెట్టమని టీడీపీ హైకమాండ్ చెప్పిందో లేకపోతే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వంగవీటి ప్రత్యేకంగా కసరత్తు ప్రారంభించారో కానీ గుడివాడలో పర్యటించడం ప్రారంభించారు.
వంగవీటి గుడివాడపై దృష్టి పెట్టారన్న ప్రచారం ప్రారంభం కాగానే కొడాలి నాని వర్సెస్ వంగవీటి పోరు రసవత్తరంగా ఉంటుందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమైంది. ఈ క్రమంలో కొడాలి నాని.. వీలైనంత వరకూ రాజకీయం చేసి వంగవీటి గుడివాడ పర్యటనల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీలో తీవ్ర అవమానాల పాలైన వంగవీటి ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం ఆ పార్టీలోకి వెళ్లడం సాధ్యం కాదని ఆయన అనుచరులు నమ్ముతున్నారు.