ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతకు ముందు మంత్రులుగా చేసి ఇప్పుడు మాజీలయిన ఇద్దరు నానీలు కూడబలుక్కుని రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉంది. ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా పరిస్థితి ఉండగానే… మచిలీపట్నం వైసీపీ ప్లీనరీకి ముఖ్య అతిథిగా వెళ్లిన కొడాలి నాని… ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పేర్ని నాని కొడుక్కి టిక్కెట్ ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో వై పేర్ని కిట్టు మచిలీపట్నం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన ప్రకటన అర్థం పేర్ని నాని పోటీ చేయట్లేదనే.
పేర్ని నాని మంత్రిగా బిజీగా ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలను పేర్ని కిట్టు చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే మచిలీపట్నం వరకూ ఆయనే మంత్రి అన్నట్లుగా చెలరేగిపోయారు. అధికారిక సమీక్షలు కూడా చేశారు. కొన్ని సార్లు వివాదాస్పదమయ్యాయి కూడా . అయితే పేర్ని నాని తాను రిటైర్మెంట్ తీసుకుని కుమారుడికి టిక్కెట్ ఇచ్చేస్తారని ఎవరూ అనుకోలేదు. అయితే కొడాలి నాని ప్రకటనతో పేర్ని నానిలో ఆ ఆలోచన ఉందని స్పష్టమవుతోంది. పేర్ని నానికి తెలియకుండా… కొడాలి ఇలాంటి ప్రకటన సొంతంగా చేసే చాన్స్ లేదు.
మచిలీపట్నంలో పరిస్థితి బాలేదని.. పేర్ని నానికి టిక్కెట్ ఇస్తే ఓడిపోతారని హైకమాండ్ భావిస్తూండటంతో… వ్యూహాత్మకంగా పేర్ని నాని తన కుమారుడ్ని రేసులోకి తెస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో పేర్ని నాని మచిలీపట్నం లోక్ సభ నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తారని అంటున్నారు. అదే సమయంలో తన ఆలోచన హైకమాండ్ వద్దకు చేరడానికి కొడాలి నానిని ఓ టూల్గా పేర్ని నాని వాడుకున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మచిలీపట్నంలో పేర్ని కిట్టుకు ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తే.. మొత్తం వ్యవహారం కామెడీ అయిపోతోంది.