మాజీ మంత్రి కొడాలి నానిని ఏ క్షణమైనా గుడివాడ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్డం గ్యాంగ్‌లోని ఆయన రైట్ హ్యాండ్ కాళీ అనే వ్యక్తిని పోలీసులు అస్సాంలో అరెస్టు చేశారు. నాని తరపున అన్ని అరాచకాలు ఆయనే చేశారు . టీడీపీ రాగానే అస్సాం పారిపోయారు. ఇప్పుడు ఆయనను పట్టుకొచ్చారు. తనకేం తెలియదని అన్నీ నాని చెబితేనే చేశానని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కొడాలి నానిపైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ అధికారంలోకి రాగానే తాము కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని పోలీసులు ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్తారో అలా గుడివాడ రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని టీడీపీ నేతలు చాలా సార్లు ప్రకటించారు. ఎందుకంటే ఆయన అంత ఘోరాలు చేశారు. టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని తన లుచ్చా భాషతో నిందించేవారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఆయనపై ఇంకా చర్యలు తీసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో జరిగిన అనేక అక్రమాలు, అవినీతిలో ఆయన పేరు ఉంది. విజిలెన్స్ పలు అంశాలపై నివేదిక రెడీ చేసింది. ఆయనపై ఎన్ని కేసులు పెట్టారో.. పెట్టేందుకు సాక్ష్యాలు రెడీ చేశారో స్పష్టత లేదు. కానీ ఈ ఏడాది మాత్రం పదేళ్ల పాటు కొడాలి నాని చూపించిన నోటి దురదకు సరైన ట్రీట్మెంట్ ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మొదటి రోజే పోలీసులు ఏ క్షణమైనా కొడాలి నాని అరెస్టు అనే లీక్‌ను ఇచ్చారు.