తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ జగన్ కర్నూలులో చేస్తున్న నిరాహార దీక్ష వేదిక వద్ద నుంచి వైకాపా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నని మాట్లాడుతూ “అక్రమ ప్రాజెక్టులు కడుతున్న తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. కనీసం దాని కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే ధైర్యం కూడా లేదు. కానీ జగన్ చేస్తున్న దీక్షలను విమర్శిస్తున్నారు. జగన్ వి దొంగ దీక్షలని చెపుతున్న చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు కూడా వస్తే అందరం కలిసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి ముందు లేదా డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు దీక్షకు కూర్చొందాము. మేము సిద్ధంగ ఉన్నాము. మీరు సిద్దమేనా?” అని కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సవాలు విసిరారు.
అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డికి ఏదయినా ఒక అంశం లేదా సమస్య గురించి గుర్తుకు వచ్చినప్పుడే దానిపై పోరాటం ప్రారంభించేసి అందరూ తనతో కలిసిరావాలంటారు. లేకుంటే ద్రోహులని వర్ణిస్తుంటారు. కానీ తను మాత్రం ఎన్నడూ ఎవరికీ మద్దతు తెలుపరు. ప్రత్యేక హోదా కోసం శివాజీ పోరాడినప్పుడు, ఆయన అన్ని పార్టీల మద్దతు కోరినా జగన్ స్పందించలేదు. కానీ తరువాత దాని కోసం తను దీక్ష మొదలుపెట్టినప్పుడు తన బద్ధ శత్రువయిన తెదేపా కూడా తనకు మద్దతు పలకాలని డిమాండ్ చేసారు. జగన్ ఏదయినా ఒక సమస్యపై దీక్షకి కూర్చోగానే అంతకు ముందు ఆ ఊసు కూడా ఎత్తని వైకాపా నేతలందరూ దాని గురించి అనర్గళంగా ప్రసంగించేసి, చంద్రబాబు నాయుడుని తిట్టడంతో ముగిస్తుంటారు.
ఒక సమస్యపై జగన్ ఎంత అకస్మాత్తుగా పోరాటం మొదలుపెడతారో అంతే ఆకస్మికంగా దానిని ముగించి పక్కన పడేస్తుంటారు. పంట రుణాల మాఫీ, హామీల అమలు, రాజధాని భూసేకరణకి వ్యతిరేకిస్తూ, ప్రత్యేక హోదా, తెలంగాణా ప్రాజెక్టులు ఇలాగ అనేక అంశాల మీద ఆయన అకస్మాతుగా పోరాటం మొదలుపెట్టేస్తారు. ఆ సమస్యలన్నీ ఎప్పటి నుంచో కళ్ళెదుటే ఉంటాయి. కానీ ఆయన ఎన్నడూ వాటి ప్రస్తావన కూడా చేయరు. వాటి కోసం ఆయన దీక్షలు మొదలుపెట్టె ముందు, దీక్ష చేస్తున్నప్పుడు మాత్రమే వాటి గురించి గట్టిగా మాట్లాడుతారు. ఆ తరువాత మళ్ళీ దాని ఊసు కూడా ఎత్తరు. ఏదయినా మూడు రోజుల ముచ్చటే! బహుశః ఈ దీక్ష కూడా అటువంటిదే కావచ్చు.
ఇక మరో విశేషం ఏమిటంటే అది ప్రత్యేక హోదా కోసం పోరాటమే కావచ్చు లేదా తెలంగాణా ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తున్న దీక్షలే కావచ్చు..ఏ పోరాటం చేసినా జగన్ లక్ష్యం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావడం. ప్రత్యేక హోదా గురించి మోడీని నిలదీయాలి. తెలంగాణా ప్రాజెక్టుల గురించి కేసీఆర్ ని నిలదీయాలి. కానీ ఆయన అన్నిటికీ చంద్రబాబు నాయుడినే నిలదీస్తుంటారు. ఆయననే బాద్యుడిని చేస్తుంటారు. ఆయననే నిందిస్తుంటారు తప్ప సంబంధిత వ్యక్తులని ప్రశ్నించరు. అంటే ఆయన సమస్యపై కాకుండా దానిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడుపై యుద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు నాయుడుని ద్వేషించడమే తన పార్టీ విధానంగా మార్చేసుకోవడంతో యదా రాజా తదా ప్రజా అన్నట్లుగా ఆయన పార్టీలో నేతలు కూడా అదే పద్దతిలో సాగిపోతున్నారు. అందుకే కొడాలి నాని మాటలు అలాగ ఉన్నాయని సరిపెట్టుకోవలసి ఉంటుంది.