వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని గుండెనొప్పితో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మొదటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తాజాగా ఆయనకు గుండెలో మంటగా అనిపించడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అది గుండె నొప్పి కాదని గ్యాస్ట్రిక్ సమస్య వల్ల అలాంటి నొప్పి వచ్చి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
గుడివాడ నుంచి సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన ఇటీవల ఎన్నికల్లో వెనిగండ్ల రాము చేతుల్లో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. గుడివాడలోనూ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వ్యక్తిగత అలవాట్ల కారణంగా వచ్చిన వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు.
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు కానీ.. కుటుంబసభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా.. లేస్తే గ్యాస్ట్రిక్ సమస్యేనా అన్నది ఆస్పత్రి వర్గాలు చెప్పాల్సి ఉంటుంది.