భారతీయ జనతా పార్టీపైనా మంత్రి కొడాలి నాని తన టెంపర్ చూపించారు. ప్రధాని మోడీ ముందు తన భార్యను రామాలయనికి తీసుకెళ్లి సతీసమేతంగా పూజలు చేయాలని ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమలకు రావాలని అడగాలని ఆయన మీడియా ముందు నేరుగా..తనదైన భాషలో ఘాటుగా వార్నింగ్ ఇచ్చేశారు. అదీ కూడా అక్కడో ఇక్కడో కాదు..నేరుగా తిరుమలలోనే. ముఖ్యమంత్రి జగన్ తో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు..పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కొడాలి నాని తిరుమలకు చేరుకున్నారు. వాస్తవానికి సీఎంతో పాటు ఆలయం కార్యక్రమాల్లో పాల్గొనేవారిలో ఆయన పేరు లేదు. అయినా ప్రభుత్వ పెద్దల నుంచి హుటాహుటిన రావాలనే సందేశం రావడంతో తిరుమలకు చేరుకున్నారు.
అక్కడ మీడియాతో మాట్లాడి.. తనదైన శైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మోడీని కూడా వదిలి పెట్టలేదు. కొడాలి నానిని కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని.. బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పదిమందిని వెంటబెట్టుకుని అమిత్‌షాను తొలగించాలంటే తొలగిస్తారా అని ప్రశ్నించారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ మాటలు హాస్యాస్పదమని ..ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని .. కొడాలి నాని సలహా ఇచ్చారు. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి బీజేపీకి ఉందా అని ఎదురు ప్రశ్నించారు. మోడీని తాను అనాల్సిన మాటలన్నీ అన్న తర్వాత…తానే బీజేపీ నేతలు ప్రధాని మోదీని బజారున పడేస్తున్నారని చెప్పుకొచ్చారు. సోమువీర్రాజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాతే… ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.
ఇప్పటికే కొడాలి నాని తిరుమల వెంకన్నపై చేసిన విమర్శలపై బీజేపీ నేతలు.. పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొడాలి నాని వారిని మరింతగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మోడీపైనా.. అమిత్ షా పైనా.. ఆషామాషీగా వ్యాఖ్యలు చేయలేరు. ప్రత్యేకంగా తిరుమలకు వచ్చి మరీ వారిని టార్గెట్ చేశారంటే… వైసీపీ వ్యూహం … చాలా దూకుడుగా ఉందన్న విషయం అర్థమవుతోందంటున్నారు.