వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల తెదేపా మాజీ ఎంపి హరికృష్ణతో కలిసి విజయవాడలోని ఒక పశువుల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరుకావడంతో ఆయన కూడా తెదేపాలో చేరబోతున్నారని మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించే కొడాలి నాని తెదేపా మంత్రులు, నేతలు, కార్యకర్తలు హాజరయిన ఆ కార్యక్రమానికి, హాజరయినందున అటువంటి అనుమానాలు కలగడం సహజం. మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను ఆయన గట్టిగా ఖండించకపోవడంతో ఆ అనుమానాలు నిజమేనని నమ్మవలసివస్తోంది. అయితే ఇంతవరకు తెదేపా నుంచి కూడా ఎటువంటి సానుకూలమయిన ప్రకటన రాలేదు. నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూ.ఎన్టీఆర్ తో కొడాలి నానికి మంచి సంబంధాలున్న కారణంగానే బహుశః ఆయనకు తెదేపాలోకి ఆహ్వానం లభించలేదేమోనని పార్టీలో కొందరు నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు లేకుంటే అంత బలమయిన నేత పార్టీలోకి వస్తానంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎందుకు కాదంటారు? అని ప్రశ్నిస్తున్నారు. బహుశః అదీ ఒక కారణమయి ఉండవచ్చును.
ఇంతకీ కొడాలి నాని నిజంగానే తెదేపాలో చేరుదామనుకొన్నారో లేదో…చేరాలనుకొంటే చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించలేదో తెలియదు కానీ ఈ పరిణామాలు, వాటిపై మీడియాలో వస్తున్న వార్తల వలన ఆయనకి ఇప్పుడు వైకాపాలోనే ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును. ఇంతవరకు ఆయనపై జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మకం ఉండేది కానీ ఈ కారణంగా ఇప్పుడు అనుమానించవలసి వస్తోంది. కనుక ఇప్పుడు ఆయన వైకాపాలో కొనసాగడం కష్టమే అలాగని తెదేపాలోకి వెళ్లేందుకు అవకాశం కనబడటం లేదు. కనుక తెదేపా కార్యక్రమానికి హాజరయ్యి కొడాలి నాని చేజేతులా కొత్త సమస్యలని ఆహ్వానించుకొన్నట్లయింది. కనుక ఆయనకి తెదేపాలోకి వెళ్ళే ఉద్దేశ్యం, అవకాశం రెండూ లేకపోయినట్లయితే, మళ్ళీ జగన్ నమ్మకం పొందవలసి ఉంటుంది. లేకుంటే ఇబ్బందే!