చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని అంతమొందిస్తే చాలు రమ్య హత్య లాంటి ఘటనలు జరగవని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యనించారు. చంద్రబాబు లాంటి వాడే దళిత యువత రమ్యను హత్య చేశాడని మంత్రి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు విద్యా కానుక ఇస్తున్నారని … దాన్నుంచి దృష్టి మళ్లించడానికి రమ్య హత్య విషయంలో ఆందోళనలు చేశారని విమర్శించారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్‌కు.. జగన్‌కు సవాల్ చేసే స్థాయి లేదని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి వాళ్లను అంతమొందించాలంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీలో అత్యంత అసభ్యంగా దూషణలు వినిపించే నేతల్లో ఒకరైన కొడాలి నాని ఆ తర్వాత చంద్రబాబు ఆరోగ్యం గురించి.. ఆయన చావు గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన లాంటి వాళ్లను మొందించాలనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రమ్య హత్య కేసు విషయంలో ముఫ్పై మూడు మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. నారా లోకేష్‌తో ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, అనితలు కేసులు నమోదైన వారిలో ఉన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, అనుమతి లేకుండా గుమికూడటం, అలాగే పోలీసులను వారి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రతోపాటు మరో పది మంది నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. టీడీపీ నేతలపై ఓ వైపు కేసులు.. మరో వైపు తిట్లతో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.