తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ తనకు సీటు ఇప్పించారని అందుకే.. ఆయన తిట్టినా, చంపినా ఎదురు మాట్లాడనని కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకో కానీ.. ఇప్పటి రాజకీయంలో జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా ఆయనను మాత్రం అటు కొడాలి నాని.. ఇటు వల్లభనేని వంశీ అడ్డం పెట్టుకుని ఎంతో కొంత రాజకీయ లాభం, రక్షణ పొందాలనుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన వల్లభనేని వంశీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించే వ్యాఖ్యలు చేశారు.
నిజానికి టీడీపీలో ఎవరూ జూనియర్ గురించి వ్యాఖ్యలు చేయడం లేదు. సోషల్ మీడియాలో కొంత మంది టార్గెటెడ్‌గా అదీ కూడా ఐ ప్యాక్ పేరోల్స్‌లో ఉన్న వారు వ్యూహాత్మకంగా జూనియర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని రాజకీయం చేసేసుకుంటున్నారు కొడాలి నాని, వల్లభనేని వంశీ. దానికి చంద్రబాబును తిట్టడానికి అవకాశంగా మల్చుకుంటున్నారు.
గన్నవరంలో దాసరి బాలవర్ధనరావు, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్లను కాదని.. టీడీపీకి ప్రచారం చేశారన్న కారణంగా ఎన్టీఆర్ సిఫారసులతో చంద్రబాబు వారికి టిక్కెట్లు ఇచ్చారు. ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చిన చంద్రబాబును కాకుండా మాకు.. ఇప్పించారంటూ.. వారిద్దరూ చంద్రబాబను బండ బూతులు తిడుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నూ తమ రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని జగన్ చేతిలో ఓడిపోతారని .. వ్యాఖ్యలు చేసిన నోటితోనే.. ఆయనేమన్నా పడతామంటూ అతి తెలివి ప్రకటనలు చేస్తున్నారు.