హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని గంటలో పడగొడతానని జగన్ సవాల్ విసరటం వలనే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ జరిపారన్న వాదనను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కొట్టిపారేశారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ గంటలో పడగొతానని ఆ రోజు అనలేదని చెప్పారు. పాత్రికేయులు అడిగితే సమాధానమిస్తూ, 21 మంది ఎమ్మెల్యేలు టచ్లోకి వస్తే మీడియాకు చెబుతానని, అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గంటసేపు కూడా ఉండనీయనని మాత్రమే జగన్ అన్నట్లు నాని వివరించారు. 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నట్లు కూడా జగన్ చెప్పలేదని గుర్తు చేశారు.
జగన్ ఎప్పుడూ రాజీనామా చేయకుండా పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలను ప్రోత్సహించరని నాని చెప్పారు. ముందుగా పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని జగన్ చెబుతారని, అందుకనే పదవీకాంక్ష ఉన్న ఎమ్మెల్యేలెవరూ తమ పార్టీలోకి వచ్చే పరిస్థితి ఉండదని నాని అన్నారు. తాను వైసీపీలోకి వెళ్ళిన సమయంలో రాజీనామా చేసే వెళ్ళానని, అప్పట్లో రు.30 కోట్లకు అమ్ముడుపోయానని ఏపీ మంత్రి దేవినేని ఉమా తనపై ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు టీడీపీవారు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంత డబ్బులు పోసి కొన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్ళటానికి దేవినేని ఉమా బ్రోకరేజి చేసినట్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఆయన తెలంగాణలో ఒకరకంగా, ఏపీలో మరోరకంగా మాట్లాడుతూ డబుల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణలో నిస్సిగ్గుగా పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని నాని అన్నారు.