ఎదురుగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి.. కానీ అన్నీ నీ భ్రమ అని మాయపుచ్చే క్యారెక్టర్లు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎక్కువగానే ఉంటాయి. గుడివాడలో కేసినో వ్యవహారం వైరల్ అయిన తర్వాత అక్కడ ఏమీ జరగలేదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. తన కల్యాణమండపంలో కేసినో పెట్టినట్లు నిరూపిస్తే ..అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించేశారు. అసలు అక్కడ కేసినోలో పెట్టలేదని స్పష్టం చేశారు.
కేసినో అంటే ఏమిటో చంద్రబాబు, లోకేష్‌కు బాగా తెలుసన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరు వచ్చినా తనను ఏమీ చేయలేరని తేల్చేశారు. కేబినెట్ సమావేశంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడినా కొడాలి నాని.. అసలు అక్కడ కేసినోనే పెట్టలేదని స్పష్టం చేశారు. మరి కే కన్వెన్షన్ సెంటర్లో రికార్డు చేసిన దృశ్యాలేమిటనేదానిపై కొడాలి నాని మాట్లాడలేదు.
నిరూపించాలని అంటున్నారు. బహుశా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు…ఆ విచారణలో అక్కడ ఎలాంటి కేసినోలు నిర్వహించలేదని.. సాంస్కృతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించారన్న రిపోర్ట్ ఇస్తారన్న నమ్మకంతో కొడాలి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా… ప్రజలు అన్నీ ప్రత్యక్షంగా చూశారు.. వారు కూడా.. అక్కడేమీ జరగలేదని అనుకోరు కదా..!