హైదరాబాద్: గుడివాడలో వైసీపీ కార్యాలయ భవన వివాదంపై స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విస్తృతంగా మాట్లాడారు. అధికార మదంతో తెలుగుదేశం పార్టీ ఈ వివాదాన్ని రేపిందని ఆరోపించారు. భవన యజమానురాలు తాను పై అంతస్తుకు ఎక్కలేకపోతున్నానని చెప్పటాన్ని తాను ఇప్పుడే మీడియాలో చూశానని, ఆ మాట తనకే చెబితే తాను లిఫ్ట్ పెట్టించేవాడినని, అది పెద్ద విషయమేమీ కాదని అన్నారు. తమతో భవనం ఖాళీ చేయించినా అక్కడే చెట్టుకింద కుర్చీ, టేబుల్ వేసుకుని కూర్చుంటానని నిన్న చెప్పానని, అయితే ఇవాళ అక్కడకు వెళదామంటే వర్షం కురుస్తోందని చెప్పారు. అయినా కూడా వెళ్ళినా ఉపయోగం ఉండదని, తమపైన లాఠీఛార్జ్ చేసి జైల్లో పెడతారని, అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రం కార్లెక్కించి పంపిస్తారని ఆరోపించారు. పైగా తాను బందరు వెళ్ళాల్సిన పని ఉందని, అక్కడ తమ నాయకుడు పేర్ని నానిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారని చెప్పారు. బుద్దా వెంకన్న స్టేట్ డాన్, రావి వెంకటేశ్వరరావు గుడివాడ డాన్‌లని ఎద్దేవా చేశారు. వారు పొద్దున్నే ఆ భవనం దగ్గరకు వెళ్ళి మొరిగినా పోలీసులు పట్టించుకోవటంలేదని ఆరోపించారు.
2019 ఎన్నికలలో గెలిచేది తమ పార్టీయేనని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడివాడలో టీడీపీ ఆఫీసుకాదు కదా, చంద్రబాబు బొమ్మకూడా కనిపించకుండా చేస్తానని అన్నారు. టీడీపీ నుంచి బయటకొచ్చిన భూమా నాగిరెడ్డి, రోజా, తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలలో ఉన్నంతకాలం జగన్‌తోనే ఉంటానని శపథం చేశారు. ఆయన గంగలో దూకితే తానూ గంగలో దూకుతానని, పైకెళితే తానూ పైకెళతానని చెప్పారు. జగన్‌తో విభేదిస్తే రాజకీయాలనుంచి వైదొలుగుతానని అన్నారు. చంద్రబాబును దూషిస్తున్నారన్న ఆరోపణలపై మాట్లాడుతూ, దేవినేని ఉమా జగన్మోహన్ రెడ్డిని తోలు తీస్తానని, తాట తీస్తానని అనటంతోనే ఇది ప్రారంభమయిందని చెప్పారు. చంద్రబాబు తాట తీసి జగన్మోహనరెడ్డికి చెప్పులు కుట్టిస్తానని హెచ్చరించానని అన్నారు. జగన్ దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, మంచి లక్షణాలు మరెవ్వరివద్దా లేవని చెప్పారు. అతనికున్న గుణానికి పెద్దవాళ్ళుకూడా పాదాభివందనం చేయొచ్చని అన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడుకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టటంపై స్పందిస్తూ, కేంద్రమంత్రి తమ మున్సిపాలిటీకి రు.150 కోట్ల నిధులు మంజూరు చేశారని, అందుకే తెల్ల గుడ్డపై స్వాగతం అని బ్యానర్ రాయించి కట్టామని తెలిపారు. నాని తగ్గాడని అంటున్నారని, రాబోయే రోజుల్లో విశ్వరూపం చూపిస్తానని అన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని తాను పల్లెత్తు మాట అనలేదని చెప్పారు.