కొడాలి నానిపై కుర్రాడ్ని బరిలోకి దింపాలని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలతో.. విరుచుకుపడే కొడాలి నానిని ఓడించాలంటే.. తెలుగు యువత అధ్యక్షుడే కరెక్ట్ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్. ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో చాపకింద నీరులా కార్యక్రమాలను చేపట్టిన అవినాష్ ఇకపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. తండ్రి ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించడంతో పాటు.. ఆయనకు దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ… అనుచరులు ఉన్నారు. గుడివాడలోనూ.. దేవినేని నెహ్రూ అనుచరవర్గం ఉంది.
నిజానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మాత్రమే ఇతర పార్టీలు విజయం సాధించాయి. అక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ టీడీపీలో ఉన్న సమయంలో.. కొడాలి నాని.. ఆ క్యాడర్ను.. సొంత అనుచరవర్గంగా మలుచుకుని పట్టు సంపాదించుకున్నారు. అందుకే.. టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ.. కొడాలి నానికి మద్దతిచ్చారు. అదే సమయంలో.. టీడీపీకి బలమైన నాయకుడు కరవయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత చురుగ్గా వ్యవహరించలేదు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావే..అక్కడ పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు పోటీ చేయడానికి కొంత మంది ముందుకు వచ్చినా… యువకుడు అయితే..నే కరెక్ట్ అని చంద్రబాబు భావించారు.
అవినాష్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. యనైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ తో విద్యార్థి కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీలో చేరిన తర్వతా తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా కూడా అవినాష్ బాధ్యతలు చేపట్టారు. కొడాలి నాని ఓడించాలన్న లక్ష్యంతో.. టీడీపీ నేతలంతా కలిసి పని చేస్తే.. టార్గెట్ చేదించడం సులభమేనని… టీడీపీ అధినేత భావిస్తున్నారు.